*సాలూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు*
పార్వతీపురం, అక్టోబర్ 1 (ప్రజా అమరావతి): స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా లోని సాలూరు మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఈ అవార్డులను న్యూ ఢిల్లీలో తల్కతోరా ఇండోర్ స్టేడియంలో శని వారం రాష్ట్రపతి ద్రౌపది మర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రులు హర్ జిత్ సింగ్ పూరే, కౌశల్ కిషోర్ అందించారు. రాష్ట్రంలో సాలూరుతో పాటు పుంగనూరు, పులివెందుల మున్సిపాలిటీలకు ఈ అవార్డు జాతీయ స్థాయిలో దక్కింది. రాష్ట్ర మునిసిపల్ పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.వి. శ్రీ లక్ష్మి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సాలూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కమీషనర్ శంకర రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్దు అందుకున్నారు. సాలూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దినందుకు అవార్డు లభించింది. సాలూరు మున్సిపాలిటీలో రోజుకు 22 టన్నుల చెత్త సేకరణ చేయడమే కాకుండా, ఇంటింటి నుండి సేకరించడం జరుగుతుంది. దీనిని తడి, పొడి చెత్తగా వేరు చేసి వర్మీ కంపోస్టుగా మార్చుకున్నారు. ఏడాదికి వర్మీ కంపోస్టు ద్వారా 3 నుండి 5 లక్షల రూపాయలు ఆదాయం మున్సిపాలిటీకి లభిస్తుంది.
addComments
Post a Comment