తారు రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన

 



*తారు రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన*


పార్వతీపురం, అక్టోబర్ 1 (ప్రజా అమరావతి): పాచిపెంట- సాలూరు మండలాల అనుసంధానంగా ఉన్న గిరిశిఖర గ్రామాలు- ఆజూరు నుండి చాకిరేయి వలస, పందిరిమామిడి వలస  వరకు తారు రోడ్డు నిర్మాణానికి కరక వలస వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర శని వారం శంఖుస్థాపన చేశారు. ఈ రహదారిని రూ.4.97 కోట్ల ఆర్.సి.పి.ఎల్.డబ్ల్యు.ఇ నిధులతో చేపడుతున్నారు. ఇంతవరకు మట్టి రోడ్డుగా ఉండడంతో వర్షాలు, వరదలు సంభవించే సమయంలో గ్రామస్తులు పలు ఇబ్బందులకు గురి అయ్యేవారు. తారు రోడ్డు నిర్మాణం వలన దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. గిరి శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ముఖ్య మంత్రి ధ్యేయం అన్నారు. గిరిజనులపై ముఖ్య మంత్రికి ప్రేమ అభిమానాలు ఎక్కువ అని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుటకు నిధులు ఉదారంగా మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అమ్మ ఒడి క్రింద ఏడాదికి రూ.15 వేలు, రైతు భరోసా క్రింద రూ.13,500, విద్యా దీవెన క్రింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన క్రింద రూ.20 వేలు వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. చేయూత పథకం రూ.18,750 ఏడాదికి జీవనోపాధి మెరుగుకు అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. వివిధ సంస్ధలతో అనుసంధానం చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 



Comments