రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
• వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ కింద మొదటి విడతలో 50లక్షల 10వేల మంది రైతులకు 3వేల 757 కోట్ల రూ.లు లబ్ది కలిగించాం
• అక్టోబరు 17న రెండవ విడతలో 50లక్షల 90వేల మంది రైతులకు రూ.2036 కోట్లు సహాయం అందించాం
• నాణ్యమైన ఎరువులు,విత్తనాలు,పురుగేమందులు అందించడం జరుగుతోంది
• ఎన్డిఆర్ఎఫ్ మార్గదర్శకాలకంటే అధికంగా నష్ట పరిహారాన్ని అందిస్తున్నాం
• పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది
• వ్యవసాయమంటే తెలియని ప్రతిపక్షనేతలు దానిపై మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది
• ఒక పధకం ప్రకారం రైతాంగాన్ని తప్పుదారి పట్టించేలా మాట్లాడడం సరికాదు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి.
అమరావతి,31 అక్టోబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గతంలో ఏప్రభుత్వం చేయని రీతిలో ఈ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలా సహకారాన్ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద మొదటి విడతలో 50 లక్షల 10 వేల మంది రైతులకు 3 వేల 757 కోట్ల రూ.లు లబ్ది కలిగించామని తెలిపారు.అలాగే రెండవ విడత కింద అక్టోబరు 17వతేదీన 50 లక్షల 90 వేల మంది రైతులకు 2 వేల 36 కోట్ల రూ.ల సహాయం అందించామని చెప్పారు.గత ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ పధకాల కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా ఈప్రభుత్వం చెల్లిస్తూ రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలుస్తోందని చెప్పారు.రైతులకు ఎరువులు,విత్తనాలు,పురుగు మందులు వంటివి లేబిలింగ్ ఉన్న నాణ్యమైన వస్తువులనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తోందని స్పష్టం చేశారు.అంతేగాక పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం ఒక్క పైసా కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రీమియం మొత్తం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నడూలేని రీతిలో రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయం మరియు రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుధ్ధితో పనిచేస్తున్నఈప్రభుత్వంపై బురద జల్లే విధంగా రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కొంతమంది ప్రతిపక్షనేతలు అనవసరమైన విమర్శలు చేయడంతో పాటు కొన్ని పత్రికలు అసత్య కధనాలను ప్రచురించడం సమంజసం కాదని మంత్రి గోవర్ధన రెడ్డి హితవు పలికారు.
స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో నింపాకే ప్రవేట్ గోదాములకు అనుమతివ్వండి:మంత్రి కాకాని
అంతకు ముందు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి రెండవ బ్లాకులోని మంత్రివర్యుల చాంబరులో స్టేట్ వేర్ హౌసింగ్,సుబాబుల్,ఆయిల్ ఫెడ్ పై అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఇతర ఆహార ధాన్యాల నిల్వలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాములను పూర్తిగా నింపిన తర్వాతే ప్రవేట్ గోదాముల్లో నిల్వ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
లక్షా 25వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ ప్రొక్యూర్మెంట్ పూర్తి:
రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆయిల్ ఫామ్ రైతుల నుండి లక్షా 25వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్(గెలలు)ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ఫామ్ రైతుల నుండి సేకరించినట్టు ఆయిల్ ఫామ్ పై వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రికి వివరించారు.ఆయా రైతులకు తగిన న్యాయం చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.అదే విధంగా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహణకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.అనంతరం సుబాబుల్ పై మంత్రి అధికారులతో సమీక్షించి ఇందుకు సంబందించి రైతులకు కల్పించాల్సిన ప్రయోజనాలపై సంబంధిత అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు.
ఈసమీక్షా సమావేశాల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి,పిసిసిఎఫ్ వై.మదుసూధన్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ ఎండి బాబూరావు, ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి కంటనాధ్ రెడ్డి,మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment