నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు



విజయవాడ (ప్రజా అమరావతి); 



*నాణ్యమైన విద్యుత్  సరఫరా, పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు*

- *ఏపిఎస్పీడిసియల్ & ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్*


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీ.ఓ.ఎం. యస్. 22, తేదీ 01–09–2020) ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని ఏపిఎస్పీడిసియల్ & ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు ఒక ప్రకటనలో తెలిపారు. మీటర్లు పెట్టడం వల్ల మోటార్లు కాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు, నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల దీనికి అవసరమైన కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. మీటర్లు ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని యూనిట్ల కరెంటు అయితే రైతులు వినియోగిస్తారో, దానికోసం అయ్యే ఛార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతులకు చెందిన ప్రత్యేక ఖాతాల్లో జమచేస్తుందన్నారు. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుందని, ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుందని తెలిపారు. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు  రైతులకు లభిస్తుందని, కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుందని ఆయన తెలిపారు. 

ఇటీవల తీసుకున్న నిర్దిష్టమైన చర్యల వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్లను ఏర్పాటు చేశామని కె. సంతోష రావు తెలిపారు. అంతేకాదు గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మార్చివేసి, 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించామన్నారు. రానున్న రోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చి వేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలు విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటు చేశామన్నారు. మీటర్లను ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం కూడా నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైనట్లు ఆయన చెప్పారు.  ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చడం జరిగిందన్నారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉందన్నారు. ఈ వ్యవసాయ సర్వీసులు దూర దూర ప్రాంతాలలో విస్తరించి ఉండడం వలన ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టతరమైందని, అందుకే స్మార్ట్మీటర్ల ఏర్పాటును విద్యుత్ సంస్థలు సంకల్పించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్తోపాటు, పివిసి వైరు, ఎంసిబి, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వలన కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కమ్కు సమకూరుతుందని ఆయన తెలిపారు.

అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. యంసిబి ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుందని, తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను కూడా తగ్గించవచ్చని, దీనివలన వ్యవసాయ పంపు సెట్లకు రక్షణ కల్పించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్నిసంస్ధలు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వం అంచనా ధర రూ.6,000తో పదేళ్ల కాల పరిమితితో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.  

ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కోమీటరుకు నెలకు రూ.200.96 పైసలుగా ఖరారైందని, వీటి కాలవ్యవధి ఏడున్నర సంవత్సరాలుగా పేర్కొనడం జరిగిందని ఛైర్మన్ కె. సంతోషరావు తెలిపారు. వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్ మీటర్లు కాగా, 20శాతం మాత్రమే త్రీ ఫేజ్ మీటర్లు ఉన్నాయని.. కానీ, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ సర్వీసులన్నీ కూడా త్రీఫేజ్ మీటర్లేనని ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద స్మార్ట్ మీటర్లకు 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుందని తెలిపారు. విద్యుత్ సంస్ధల్లో డీబీటీ విధానం కొరకు ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మీటర్ల ద్వారా మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1800 చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత మిగిలిన మొత్తంతో పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లు మాత్రమే అని తెలిపారు. గతంలో కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో ఈ టెండర్ల అంచనాలను రూపొందించడం జరిగిందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం హెచ్చు, తగ్గులను పరిశీలించి టెండర్లు రద్దు చేసిందన్నారు. తదుపరి ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరిపాలన అనుమతులు లభించిన  తర్వాతే కొత్తగా టెండర్లు పిలవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్ధ్యాన్నిఅంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించికునే సౌలభ్యం ఉంటుందన్నారు.  అంతే కాకుండా సరఫరా అంతరాయాలను, వోల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్ధ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని ఏపిఎస్పీడిసియల్ & ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 



Comments