ఈ రోజు నెల్లూరు రాకపోయి ఉంటే జీవితంలో ఓ మంచి అనుభూతిని కోల్పోయి ఉండేవాణ్నని



నెల్లూరు, అక్టోబర్ 3 (ప్రజా అమరావతి);


అంత్యోదయ మార్గంలో గ్రామీణ ప్రజలకు, యువతకు, అణగారిన వర్గాలకు స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని లోక్ సభ సభాపతి శ్రీ ఓం బిర్లా తెలిపారు. 


సోమవారం ఉదయం హెలికాఫ్టర్ ద్వారా వెంకటాచలం లోని అక్షర విద్యాలయానికి చేరుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా కు జిల్లా కలెక్టర్ శ్రీ కెవియన్ చక్రధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శ్రీ ఆదాల ప్రభాకర రెడ్డి,జిల్లా ఎస్ పి విజయారావు జాయింట్ కలెక్టర్ రొనంకి కూర్మనాధ్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు.



అనంతరం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ – సోమ సాంకేతిక శిక్షణా సంస్థ అందిస్తున్న పలు శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సోమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ సారధి డ్రైవింగ్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకున్న ఆయన ట్రస్ట్ అందిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముప్పవరపు ఫౌండేషన్ ను సందర్శించి అక్కడి శిక్షణార్థులతో ముచ్చటించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో అనన్య పారామెడికల్ కోర్సుల శిక్షణా కేంద్రాన్ని, అక్కడి కౌసల్యా సదన్ లో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ డ్రోన్ పైలట్ ట్రైనింగ్  కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆయన, ప్రతిభను కనపరచిన పలువురు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.


ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు తనకు ఎంతో ఆనందాన్ని పంచాయన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఈ రోజు నెల్లూరు రాకపోయి ఉంటే జీవితంలో ఓ మంచి అనుభూతిని కోల్పోయి ఉండేవాణ్నని


తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు అధునాతన సాంకేతికతను చేరువ చేస్తున్న స్వర్ణభారత్ సేవలను అభినందించిన ఆయన, జీవితంలో యువత నిలదొక్కుకునేందుకు డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించటం, అదే విధంగా ఈ రోజు పుష్కలమైన అవకాశాలు ఉన్న డ్రోన్ పైలట్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించటం ఆనందంగా ఉందని తెలిపారు. కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది కొరత ప్రస్ఫుటంగా కనిపించిందని, ఈ నేపధ్యంలో పారామెడికల్ కోర్సుల ద్వారా వైద్య రంగంలో సహాయకుల కొరత తీరగలదని ఆకాంక్షించారు.


వెంకయ్యనాయుడు గారిని విద్యార్థి దశ నుంచి చూస్తూ, పార్టీలో కార్యకర్త స్థాయి నుండి ప్రస్తుత స్థితి కి ఎదిగానన్న ఓంబిర్లా, రాజకీయాలతో సంబంధం లేకుండా వారు అందించిన, అందిస్తున్న స్ఫూర్తి ఎంతో విలువైనదన్నారు. వారన్నా, వారు మాట్లాడే తీరన్నా అభిమానించని వారు ఎవరూ ఉండరన్న ఆయన, ఈతరానికి స్ఫూర్తిని పంచే నాయకుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారని తెలిపారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ, స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి సేవా సంస్థను ఏర్పాటు చేయాలన్న వారి ఆలోచన, వారిలోని సేవా నిరతి కి మంచి ఉదాహరణని తెలిపారు.


విజయదశమి దుష్టసంహారం – సామాజిక జాఢ్యాలపై పోరాటం

                       ........వెంకయ్యనాయుడు


ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు జీవితంలో అన్నీ మనం ఊహించినట్లు జరగవని తెలిపారు. ముఖ్యంగా అధికారానికి మనం దగ్గరగా వెళ్ళే కొలదీ దూరమౌతుందని, దూరంగా జరిగే కొలదీ దగ్గరవుతుందన్నారు. జీవితంలో ఏదీ ఆశించకుండా పని చేసుకుంటూ ముందు సాగడం వల్ల ప్రశాంతంగా అనుకున్నది చేయగలిగానని, ప్రజలకు చేసిన సేవ అధికారంగా మారి, మరింత సేవ చేసే అవకాశానిచ్చిందన్నారు.

సేవకు తావు లేని జీవితం రుచి లేని భోజనం లాంటిదన్న వెంకయ్యనాయుడు ప్రతి ఒక్కరూ జీవితంలో సేవను ఓ భాగంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ  సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన విజయదశమి దుష్టసంహారానికి చిహ్నమని, అవినీతి లాంటి సామాజిక జాఢ్యాలపై విజయదశమి పోరాట స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో లోక్ సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు హర్షవర్ధన్, ప్రముఖ గాయకులు గంగాధర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమ ప్రారంభంలో అక్షర విద్యాలయంలోని స్వామి వివేకానంద, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.


కార్యక్రమ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లోని బ్రిడ్జి స్కూలును తమ వివాహ మహోత్సవం సందర్భంగా దత్తత తీసుకుంటున్నట్లు వెంకయ్యనాయుడు గారి మనుమరాలు  సుష్మ – కిషన్ దంపతులు ప్రకటించారు. వారికి ఓంబిర్లా, వెంకయ్య నాయుడు అభినందనలు తెలియజేశారు. శుభాకార్యాల్లో భాగంగా సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించాలన్న వారి చొరవ యువతరానికి ఆదర్శనీయమని తెలిపారు.



Comments