*సమస్యల పరిష్కారానికి... నూతన పంథా...
*
*ప్రయోగాత్మకంగా స్పందన ప్లస్
పార్వతీపురం, అక్టోబర్ 7 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో "స్పందన" సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మకంగా "స్పందన ప్లస్" నూతన పంథాకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్పందన ప్లస్ కార్యక్రమానికి నాంది పలికారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. రెవిన్యూ సమస్యల పరిష్కారానికి మే నెలలో ప్రత్యేక రెవిన్యూ స్పందన కార్యక్రమం చేపట్టి వాటిని గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెవిన్యూ - పోలీసు శాఖలతో సంబంధం కలిగిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు చొరవ తీసుకుని ఇరు శాఖల సమన్వయంతో పరిష్కారానికి ముందడుగు వేశారు. ఈ మేరకు శుక్రవారం ఇరు శాఖల సమన్వయ వీడియో కాన్ఫరెన్స్ ను మండల అధికారులు, స్పందన ఆర్జీదారులతో నిర్వహించారు.
అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాదాన్యత మేరకు స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించడం ధ్యేయమని చెప్పారు. ఆర్జీలపై పది రోజులలో నివేదిక సమర్పించాలని మండల అధికారులను ఆదేశించామని అన్నారు. స్పందనలో అందిన ఆర్జీలను విభజించి మండలాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. కొమరాడ, మక్కువ, సీతానగరం మండలాల్లో అందిన ఆర్జీలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
పోలీసు సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఆర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగరాదని అన్నారు. వివిధ శాఖలు ఆర్జీదారులతో కూర్చొని అక్కడికక్కడే పరిష్కారం చేయాలని లక్ష్యం అన్నారు. ఆక్రమణదారులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టాలని సూచించినట్లు ఆయన చెప్పారు. పేదలు, బడుగువారు, వృద్దులు, మహిళలు స్పందనకు వస్తున్నారని ఆయన అన్నారు. ఆర్జీలలో వాస్తవాలు పూర్తిగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చేపట్టడం ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు ఎస్పీ డా.ఓ.దిలీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment