*ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్*
పార్వతీపురం, అక్టోబర్ 17 (ప్రజా అమరావతి): పాలకొండ మండలంలోని జంపరకోట పంచాయతీ పరిధిలో గల బడ్డుమాసింగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు సోమ వారం సందర్శించారు. విద్యార్థినుల చదువు, బోధన అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్ధులందరూ ఇష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులందరూ తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కొర్రా రామలక్ష్మీ, పాలకొండ డీఎస్పీ శ్రావణి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి సూర్యనారాయణ, ఏటీడబ్లుఓ మంగవాణి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment