*రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్లను ఆమోదించిన ధార్మిక పరిషత్
*
*ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*
అమరావతి, అక్టోబరు 10 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్లకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, కోనసీమ జిల్లా, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, గుణుపూడి, భీమవరం, శ్రీ నీల మణి దుర్గా అమ్మవారి దేవాలయం, పాతపట్నం, శ్రీకాకుళం మరియు శ్రీ కోదండరామ స్వామి దేవాలయలం, తిమ్మయ్యపట్నం, తిరుపతి జిల్లాలోని దేవాలయాల పాలక మండళ్లకు రాష్ట్ర ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపిందన్నారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2009 తదుపరి 13 సంవత్సరాల తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం జరిగిందన్నారు. దేవాలయాలు, మఠాలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా లేని అధికారాలు అత్యున్నతమైన అధికారాలు ధార్మిక పరిషత్ కు రాజ్యాంగ పరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. దేవాలయాలు, మఠాల నిర్వహణలో ఎటు వంటి అన్యాయాలు, అక్రమాలకు తావు లేకుండా వాటిని క్రమబద్దీకరించడానికి ఈ ధార్మిక పరిషత్ అధికారాలు ఉన్నాయన్నారు.
నేడు జరిగిన ఈ ధార్మిక పరిషత్ తొలి సమావేశంలో రాష్ట్రంలో రూ.25 లక్షల నుండి రూ.1.00 కోటి వరకూ ఆదాయం ఉన్న పై తెల్పిన దేవాలయాల పాలక మండళ్లను ఆమోదించడంతో పాటు మఠాలకు సంబందించిన వాటిపై సమగ్రంగా చర్చిండం జరిగిందన్నారు. మఠాలకు సంబందించి ముఖ్యంగా హాథీరాంజీ మఠం, బ్రహ్మంగారి మఠం, గాలిగోపుర మఠం, బ్రహ్మనంద మఠం, జగ్గయ్యపేట, అహాబిలం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం పై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి వాటి విధి, విధానాలను పరిశీలించడం జరిగిందన్నారు. హాథీరాం మఠం దాదాపు 650 సంవత్సరాల క్రింతం ఏర్పడిందని, ఈ మఠానికి సంబందించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఆ వివరాలను తదుపరి వెల్లడిస్తామన్నారు. జగ్గయ్యపేటలోని బ్రహ్మనంద మఠానికి సంబందించి సమగ్ర వివరాలపై నివేదిక రూపొందించి ధార్మిక పరిషత్ కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబందించి పూర్తి వివరాలను తదుపరి సమావేశంలో సమగ్రంగా వివరిస్తానని ఆయన తెలిపారు.
*నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనంగా రూ.20 వేలు…*
అసిస్టెంట్ కమిషనర్, డిప్యుటీ కమిషనర్ మరియు జాయింట్ కమిషనర్ హోదా స్థాయి దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల న్యాయమైన కోర్కెను సానుకూలంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వారి జీవనోపాదికి ఎటు వంటి ఆటంకం కలుగకుండా ప్రతి నెలా వారికి కనీస వేతనం రూ.20 వేలు అందేలాచూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఇటు వంటి తరహా దేవాలయాలు రాష్ట్రంలో 50 వరకూ ఉన్నాయని, వాటిలో దాదాపు 850 మంది నాయీ బ్రాహ్మణులు పనిచేస్తున్నారన్నారు. కేశఖండనకై ప్రతి వ్యక్తి నుండి వారు రూ.25/- లు వసూలు చేస్తుంటారని, ఈ విధంగా వసూలు చేసే సొమ్మును నాయీ బ్రాహ్మణులే ఉపయోగించుకుంటారన్నారు. అయితే అలా వసూలు అయ్యే సొమ్ము ఆఫ్ సీజన్ లో నెలకు కనీసం రూ.20 వేలు కూడా ఉండక పోవడం వల్ల వారి జీవనోపాది చాలా కష్టంగా ఉంటుందని నాయీ బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి దేవాలయంలో సంక్షేమ ట్రస్టు ఉందని, ఆ ట్రస్టు ద్వారా వీరికి కనీస వేతనంగా రూ.20 వేలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం కేశఖండనకై వసూలు చేసే సొమ్ము రూ.25/- నుండి రూ.35/-లకు పెంచాలని నాయీ బ్రాహ్మణుల కోరుతున్నారని, ఈ విషయం కూడా ప్రభుత్వ పరిశీనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment