16, 17 తేదీల్లో ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్-2022 నిర్వహణ
విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యం
పాల్గొంటున్న 22 పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్ధులు
ఫెస్ట్ లో 55 ప్రాజెక్టులు ప్రదర్శన
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జె.ఆశారమణి
విజయనగరం, నవంబరు 14 (praja amaravati):
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబరు 16, 17 తేదీల్లో నగరంలోని ఎం.ఆర్.ఏ.జి.ఆర్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్ ఫెస్ట్-2022 నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జె.ఆశారమణి వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, వారిలోని వినూత్న స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో పాలిటెక్నిక్ కళాశాలల్లో వార్షిక శాస్త్ర సాంకేతిక ఉత్సవాలను నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ఈ రెండు రోజుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 22 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్ధులు ఈ రెండురోజుల ప్రదర్శనలో పాల్గొంటున్నారని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 5 ప్రభుత్వ, 17 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 220 మంది విద్యార్ధులు పాల్గొంటున్నారని, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 54 ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. విద్యార్ధుల్లో ఆవిష్కరణల సంస్కృతిని మెరుగుపరచడానికి, సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొనే అలవాటును ప్రోత్సహించడానికి ఒక ప్రయత్నంగా సాంకేతిక విద్యాశాఖ ఈ పాలిటెక్ ఫెస్ట్ ను నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రదర్శనల్లో రెండు ఉత్తమ మోడల్ లను ఎంపికచేసి నగదు బహుమతిగా మొదటి ప్రాజెక్టుకు రూ.25,000, రెండవ ప్రాజెక్టుకు రూ.10,000 బహుమతులు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడలో ఈనెల 24 నుంచి 26వరకు జరిగే రాష్ట్రస్థాయి టెక్ ఫెస్ట్‌లో పాల్గొనే 15 ఉత్తమ ప్రాజెక్టులను ఈ పాలిటెక్ ఫెస్ట్‌లో ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు ఈనెల 16న జరిగే ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు వెల్లడించారు.
పత్రికా సమావేశంలో చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.విజయలక్ష్మి, విద్యార్ధి వ్యవహారాల సలహాదారు ఎస్.వి.రమణ, ఫెస్ట్ కో ఆర్డినేటర్ సి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment