న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత” మరియు “హక్ హమారా భీ తో హై @ 75” తుది దశకు చేరాయి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 




అక్టోబరు 31న మొదలైన పాన్  ఇండియా నల్సా కార్యక్రమాలు “న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత” మరియు “హక్ హమారా భీ తో హై @ 75” తుది దశకు చేరాయి


. ఈ సందర్భంగా నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. 


ఈ కార్యక్రమాలలో భాగంగా కారాగారాల్లో ఉన్న ప్రతీ ఖైదీతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నామని,  వివరాలను సేకరించామని గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి. పి.వెంకట జ్యోతిర్మయి గారు అన్నారు. ఈ సమాచారం ద్వారా అర్హులైన వారిని ముందస్తుగా విడుదల  చేయడం లేదా న్యాయ పరంగా వారికి అందవలసిన సేవలను అందించడం “హక్ హమారా భీ  తో హై @ 75” ఉద్దేశం అని తెలిపారు.


 సమాజం చైతన్యవంతం అవ్వడానికి ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల వారిని ఆహ్వానించామని, మనమందరం కలసికట్టుగా మెరుగైన సమాజం కోసం పోరాడాలని వారు అన్నారు.  

“న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత” కార్యక్రమం ద్వారా జిల్లా అంతటా విస్తృతంగా న్యాయ ప్రచారం జరిగిందని, ర్యాలీలు, న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామని, ఇంటింటికీ వెళ్ళి న్యాయ సమస్యలు తెలుసుకున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి తెలిపారు. 


అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిపాలన విభాగం వారు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, పోలీసు వారు, విద్య, వైద్య, తదితర సంస్థల వారు, ఎన్జీవోలు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు  “అందరికీ న్యాయం అందుబాటులో న్యాయం”, “రాజీ మార్గమే రాజమార్గం” అంటూ నినాదాలు చేస్తూ రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం నుండి దేవిచౌక్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం మానవ హారంగా ఏర్పడి సంఘీభావాన్ని తెలియచేస్తూ ఐక్యత చాటారు.

Comments