ఎకో టూరిజం పార్క్ ల ఏర్పాటు వేగవంతం చేయాలి- సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష


- ఎకో టూరిజం పార్క్ ల ఏర్పాటు వేగవంతం చేయాలి


- సోమశిల బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం పనులు వెంటనే ప్రారంభించాలి

- జూ పార్క్ ల నిర్వహణ కోసం అధికారుల నియామకం

- ఎకో పార్క్ ల ఏర్పాటులో స్థానికంగా ఉన్న వివిధ సంస్థల సహకారం 


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి):


రాష్ట్రంలో ప్రతి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోనూ ఒక ఎకో పార్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధన, ఇఎస్ఎఫ్&టి, ఎం&జి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో మంగళవారం అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం పార్క్ కోసం వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రజాసంఘాలు, సంస్థల సహకారంతో ఎకో పార్క్ లను అభివృద్ధి చేయాలని, ఈ మేరకు ఆయా సంస్థలను కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. అటవీ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల నుంచి కూడా సహకారాన్ని తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జూపార్క్ లను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, కొత్త జంతువులను జూ లలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకోసం డైరెక్టర్, క్యూరేటర్ వంటి కీలక పోస్ట్ లను భర్తీ చేయాలని ఆదేశించారు. 

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై. మధుసూదన రెడ్డి, పిసిపిఎఫ్ ఆర్పీ ఖజూరియా, డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments