"ని-క్షయ్ మిత్ర" గా పేర్లు నమోదు చేసుకోండి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



"ని-క్షయ్ మిత్ర" గా పేర్లు నమోదు చేసుకోండి



ప్రతి నెలా రు.500 ఇవ్వడం ద్వారా టీబీ నుంచి వారిని విముక్తి చెయ్యగలం


టీబీ రహిత జిల్లాగా తూర్పు గోదావరి ని తీర్చిదిద్దుదాం ...


- కలెక్టర్ కె. మాధవీలత 


టిబి చికిత్సలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి మరియు టిబి నిర్మూలన దిశగా జిల్లాను నిలపడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.


బుధవారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, వివిధ శాఖల జిల్లా, డివిజన్ తదితర శాఖల అధికారులతో  "ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ " పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, టిబి ని సమూలంగా నిర్మూలన చేసే దిశలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళాల్సి ఉందన్నారు. లక్ష్య సాధనలో  పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని కమ్యూనిటీ వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం ఈ సమావేశం ఉద్దేశించబడిందని మాధవీలత అన్నారు. వ్యక్తిగత, సామూహికంగా అందరం కలిసి టిబి బారిన పడిన వారికి తగిన పౌష్టికాహరం, మందులు అందించే సేవ చెయ్యడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. 


ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతా అలవర్చుకుని, కనీసం ఒక్కరినైనా దత్తత తీసుకుని వారికి కావలసిన బలవర్ధకమైన ఆహారం, సప్లిమెంటరీ న్యూట్రీషియన్ మందులు అందించే బాధ్యత చేపట్టాలని కోరారు. ఎందరో తన వద్దకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తామని అటుంటారు. అటువంటి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. టీబీ రోగుల సంరక్షణ కోసం ముందుకు వచ్చే వ్యక్తులు మరియు సంస్థలను "ని-క్షయ్ మిత్ర" లుగా వారి పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా చేయూత నివ్వగలం అన్నారు.  ఆ ప్రక్రియ లో  బ్లాక్‌లు, జిల్లాలు లేదా వ్యక్తిగత రోగిని కూడా దత్తత తీసుకోవచ్చునన్నారు.  వారు కోలుకోవడంలో సహాయపడటానికి పోషకాహార మరియు చికిత్స సహాయాన్ని అందించవచ్చునని ఆమె తెలిపారు. తన వంతుగా ఇద్దరు టీబీ బాధితులను దత్తత తీసుకోవడం జరిగిందని తెలియచేశారు. ఐ ఎమ్ ఏ శ్రీనివాస్ వంటి  మరింత మంది కి ఆదర్శంగా నిలిచారని, ఆయనను అభినందిస్తున్నా అన్నారు. ఎవరికి వారు ఇటువంటి సామాజిక బాధ్యత గా భావించి ముందుకు రావాలని కోరుకుందాం అన్నారు.



జిల్లా టిబి నియంత్రణ అధికారి డా ఎన్. వసుంధర మాట్లాడుతూ జిల్లాలో సుమారు 850 మంది టిబి బాధితులు ఉన్నారని, వారిలో ఇప్పటి వరకు 46 మంది వ్యక్తులు "ని-క్షయ్ మిత్ర" లుగా వారి పేర్లు నమోదు చేసుకుని 122 మంది వ్యక్తుల బాధ్యత తీసుకోవడం జరిగిందన్నారు. "ని-క్షయ్ మిత్ర" లుగా మరింత మంది వారి పేర్లు నమోదు, మరింత సమాచారం కోసం 9492297887 ను సంప్రదించాలని సూచించారు. ప్రతీ నెలా రూ.500 లు అందించడం ద్వారా ఒక టిబి సోకిన వ్యక్తిని ఆరు నెలలు పాటు ఆర్థిక సహాయం చేయడం కోసం పేర్లను నమోదు నేషనల్ పోర్టల్ లో నమోదు చేయండి అని విజ్ఞప్తి చేశారు.



Comments