సుబాబుల్,యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు సానుకూలంగా స్పందించిన కంపెనీలు

 *సుబాబుల్,యూకలిప్టస్  రైతులకు గిట్టుబాటు ధర  చెల్లించేందుకు  సానుకూలంగా స్పందించిన కంపెనీలు*


*•పేపర్ మిల్స్ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి చర్చలు సఫలం*

*•దళారుల ప్రమేయం లేకుండా  సొమ్మును రైతులకు నేరుగా చెల్లించాలి*

                                                          

అమరావతి, 3 నవంబరు (ప్రజా అమరావతి):  సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సుబాబుల్ మరియు డిబార్క్డ్ యూకలిప్టస్ రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై  కనీసం రూ.200/- పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకారం తెల్పడంతో  వారితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే  నేరుగా ఈ సొమ్మును  చెల్లించే విధంగా పేపర్ మిల్స్ చర్యలు తీసుకోవాలని  మంత్రి కోరారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై పలు పేపర్ మిల్స్ ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా  పేపర్ మిల్స్ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు.  బహిరంగ మార్కెట్ లో దాన్యం, చిరుదాన్యాలు, పప్పు దినుసులు ధరలు ఏ మాత్రం రైతులకు గిట్టుబాటుగా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం  రాష్ట్రంలో ఆనవాయితీ అయిందన్నారు. అదే విధంగా సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే విషయంలో పేపర్ మిల్స్ యాజమాన్యం అండగా నిలవాలని ఆయన కోరారు. సుబాబుల్, యూకలిప్టస్ ధరలు గత ఐదారు మాసాల నుండి ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ,  ఆ ధరలను మరింత ఆశాజనకంగా పెంచే విధంగా  పేపర్ మిల్స్ యాజమాన్యం సహకరించాలన్నారు. మంత్రి విజ్ఞప్తికి పేపర్ మిల్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ రైతులకు సాద్యమైనంత ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు ధర చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మంత్రి ఆనందాన్ని వ్యక్తంచేస్తూ వారికి అభినందనలు తెలిపారు. 

                                                                                                                                                                                   వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాల కొండయ్య, మార్కెటింగ్ శాఖ  అసిస్టెంట్ సెక్రటరీ కె.లక్ష్మీభాయి, జాయింట్  డైరెక్టర్లు జి.రాజశేఖర్, కె.శ్రీనివాసరావు తదితర అధికారుతో పాటు  ఐ.టి.సి. ప్రతినిధి గోబల కన్నన్,  రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్స్ ప్రతినిధి  కె.బాల కృష్ణ, కాగజ్ నగర్ సిరిపూర్ పేపర్ మిల్స్ ప్రతినిధి ఎన్.ఎస్.కన్నబాబు, గుజరాత్ జె.కె. పేపర్ మిల్స్ ప్రతినిధులు టి.ఎస్.భగవాన్, వై.రుషికేశ్వరరావు, మహారాష్ట్ర బల్లార్పూర్ కు చెందిన బి.ఐ.ఎల్.టి. ప్రతినిధి జి.వి.డి. ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

                                                                                                                                                                                        

Comments