*ఎ.కొండూరుకు కొండంత అండ*
*కిడ్నీ బాధితులందరికీ జగనన్న తోడుగా ఉన్నారు*
*శాశ్వత పరిష్కారం దిశగా సత్వర చర్యలు*
*మెరుగైన వైద్యం అందేలా అన్ని వైపుల నుంచి సాయం
*
*వారం రోజుల్లో కొండూరులో నూతన డయాలసిస్ యూనిట్*
*ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా కిడ్నీ వ్యాధి మందుల పంపిణీ*
*ఎ.కొండూరు ప్రాంత ప్రజలు వెళ్లే అన్ని ప్రైవేటు వైద్యశాల్లో ఆరోగ్యశ్రీ అమలవ్వాలి*
*అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చిన మంత్రి విడదల రజిని*
*కొండూరు ప్రాంత ప్రజలు ఆస్పత్రికి వెళ్లేందుకు ఉచిత రవాణ వాహనం ప్రారంభం*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పర్యటనకు వచ్చామని చెప్పిన మంత్రి రజిని*
ఎ.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా (ప్రజా అమరావతి);
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని, కిడ్నీ రోగుల సమస్యలు పరిష్కరించాలని, అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు ఆదేశాలు జారీచేశారని, ఆ మేరకు ఈ ప్రాంతం పర్యటనకు వచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం నుంచి అందుతున్న ఫలాలు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి విడదల రజినితోపాటు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం ఈ ప్రాంత పర్యటనకు వచ్చారు. మంత్రి వెంట స్థానిక తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీవీవీపీ కమిషనర్ మరియు డిఎంఇ డాక్టర్ వినోద్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. తొలుత మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు ఎ.కొండూరు మండలం మాన్ సింగ్ తండాకు వెళ్లారు. అక్కడి ప్రజలతో సమావేశమ్యారు. కిడ్నీ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. అనంతరం దీప్లానగర్‌కు వెళ్లారు. అక్కడి కిడ్నీ వ్యాధి బాధితులతో మాట్లాడారు. స్థానిక సమస్యలపై అక్కడి వారితో చర్చించారు. అక్కడి నుంచి ఎ.కొండూరు పీహెచ్‌సీని సందర్శించారు. కిడ్నీ వ్యాధి రోగులకు అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాధి నిర్థారణ పరికరాలను పరిశీలించారు. ఆయుష్ వైద్యశాలలో కొత్తగా ఏర్పాటుచేయబోతున్న డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా అడుగడుగునా సిబ్బందికి మంత్రి విడదల రజిని పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఎం.కొండూరు మండలంలోని వైద్య సిబ్బంది, పీహెచ్‌సీ సిబ్బంది అందరితో కలిపి సమీక్ష నిర్వహించారు.
*మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు*
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రభావం చూపించడానికి మంచినీటి సమస్య కూడా ఒక కారణంగా నివేదికలు చెబుతున్నాయన్నారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తాత్కాలికంగా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు తండాలకు ట్యాంకర్ల ద్వారా సురక్షిత మంచినీటిని అందజేస్తున్నామని చెప్పారు. మండలంలోని అన్ని తండాలకు వారం రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం పది ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్నారని, ఇకపై 38 ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా అవుతుందన్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు ప్రాజెక్టులు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఒకటి కుదప నుంచి రూ.6 కోట్ల నిధులతో పైపు లైను పనులు చేపట్టబోతున్నామన్నారు. వచ్చే ఏడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. మరో ప్రాజెక్టులో భాగంగా మైలవరం నుంచి రూ.38 కోట్లతో పైపు లైను పనులు చేపట్టబోతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఏడాదిన్నరలోగా పూర్తవుతుందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఎ.కొండూరు మండలం మొత్తం ఇంటింటికి సురక్షిత మంచినీరు సరఫరా అవుతుందన్నారు. అప్పటివరకు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆర్వో ప్లాంట్లను విస్తృతంగా తనిఖీలు చేసి, సురక్షిత మంచినీరు ప్రజలకు అందేలా చేస్తున్నామన్నారు.
*ఉచితంగా మందులు, టెస్టులు*
ఎ.కొండూరు ప్రాంతంలో ఇప్పటివరకు 378 మంది కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు గుర్తించామన్నారు. వీరిలో కేవలం 23 మందికే డయాలసిస్ అవసరం ఉందని చెప్పారు. మిగిలినవారికి మందులతో వ్యాధి నయం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వీరందరికీ ఉచితంగా మందులు ఇస్తున్నామని చెప్పారు. ఉచితంగా డయాలసిస్ చేయిస్తున్నామన్నారు. డయాలసిస్ వీరికి సమీపంలోనే అందేలా తిరువూరులో ఒక డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. మరో డయాలసిస్ యూనిట్‌ను ఎ.కొండూరు పీహెచ్‌సీలోనే ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. మరో వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. మందుల కోసం విజయవాడ వెళ్లాల్సి వస్తోందని ఈ సందర్భంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాన్ని తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ విధానం ద్వారా ఉచితంగా కిడ్నీ మందులు కూడా మీకు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అప్పటికప్పుడు అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిపుణులు సూచన మేరకు కిడ్నీ వైద్యానికి సంబంధించి 15 రకాల మందులను ఉచితంగా అందుబాటులో ఉంచామని, ఆరు నెలలకు సరిపడా నిల్వలు ఎ.కొండూరు పీహెచ్‌సీలోనే అందుబాటులో ఉంచామని వివరించారు.
*పలు ఆదేశాలు*
స్థానికుల నుంచి పలు అభ్యర్థనలు విన్న మంత్రి విడదల రజిని అప్పటికప్పుడు అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ నిధులతో ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆ మేరకు శనివారం నుంచే ఈ వాహనాన్ని స్థానిక పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి శనివారం ఈ వాహనాన్ని ప్రారంభించారు కూడా. ఈ ప్రాంతంలోని ప్రజలు కిడ్నీవ్యాధిపై పూర్తి అవగాహనతో ఉండాలని, ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు పూర్తిస్థాయిలో వీరికి దక్కాలని, అందుకోసం ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 104 వాహనాల ద్వారా కిడ్నీ వ్యాధి మందులు ఈ ప్రాంతంలో వారికి ఉచితంగా ఇవ్వాలని చెప్పారు. ఇక్కడి ప్రజలు వైద్య సేవలు కోసం వెళుతున్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. కిడ్నీ వ్యాధి బాధితులందరికీ ప్రభుత్వ పింఛన్ అందాలని, అందుకోసం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుహాసిని ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment