కార్యకర్తల సంక్షేమానికి శిష్ట్లా లోహిత్ చేస్తున్న కృషిని అభినందించిన చంద్రబాబు



 *- కార్యకర్తల సంక్షేమానికి శిష్ట్లా లోహిత్ చేస్తున్న కృషిని అభినందించిన చంద్రబాబు


*



కర్నూల్, నవంబర్ 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చేస్తున్న కృషిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అభినందించారు. చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో ఐటీ ప్రెజెంటేషన్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న పథకాలపై శిష్ట్లా లోహిత్ తో చంద్రబాబు స్వయంగా మాట్లాడించారు. కర్నూల్ జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమక్షంలో శిష్ట్లా లోహిత్ ను చంద్రబాబు ప్రశంసించారు. ముందుగా శిష్ట్లా లోహిత్ ను చంద్రబాబు సభకు పరిచయం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబు తెలిపారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కార్యకర్తలకు అన్నివేళలా అండగా నిలుస్తోందన్నారు. దేశ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయన్నారు. ఎన్నో పార్టీలు అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్ళు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా నిత్యం తెలుగు ప్రజలకు సేవలందించడం జరుగుతోందన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కార్యకర్తలు పడుతున్న కష్టం వెలకట్టలేనిదని అన్నారు. ఎన్ని అవరోధాలను కల్పించినా వాటిని తట్టుకుంటూ త్యాగాలు చేస్తున్న కార్యకర్తలందరినీ తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటోందన్నారు. ఆస్తులు, ఆప్తులను పోగొట్టుకుని పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు చంద్రబాబు భరోసాను ఇస్తున్నారన్నారు. కన్నబిడ్డల మాదిరిగా కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ ప్రేమను చూపుతోందన్నారు. కార్యకర్తల శ్రమ వల్లే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోందన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నూల్ జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన విజయవంతమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రానుందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రాభివృద్ధికి అనేక ప్రణాళికలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ అభిప్రాయపడ్డారు.

Comments