సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేయాలి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

 *సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేయాలి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు


*


అమరావతి (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ఓ శనిలా పట్టి వ్యవస్థల్ని నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆక్వా సదస్సులో టీడీపీ అధినేత మాట్లాడుతూ ప్రభుత్వ ధనదాహం, అహంకార ధోరణికి ఆక్వా రైతులు బలైపోతున్నారన్నారు. ఎదురు దాడితో రైతు సమస్యల పరిష్కారం కావని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని హితవుపలికారు. ‘‘సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేసి పో, నేనొచ్చి ఎలా పరిష్కరించాలో చూపిస్తా’’ అని అన్నారు. జోన్ విధానం తీసుకొచ్చి రైతుల పొట్టెందుకు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఆక్వారంగంలో 70 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. నాటి విధానాలను కొనసాగించి ఉంటే ఆక్వా రైతులకు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఖర్చులు రెట్టింపై రంగం మొత్తం కుదేలైపోయిందని విమర్శించారు. 80 శాతం రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.80 పడుతోందన్నారు. రూ.4 పైచిలుకు ఉన్న యూనిట్ విద్యుత్ ధరను టీడీపీ ప్రభుత్వం రూ.2కి తగ్గించిందని టీడీపీ అధినేత గుర్తుచేశారు. అప్పులపాలై ఆక్వా రైతులు బాధపడుతుంటే, బాగా కొట్టాను వీళ్లనంటూ జగన్ తెగ ఆనందపడుతున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగంలో ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటున్నారో తెలుసుకునేందుకే త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి నియమించారన్నారు. టన్నుకు రూ.5వేలు చొప్పున ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా వసూలు చేసే డబ్బుతో ఓట్లు కొందామనుకుంటున్నారని అన్నారు. వంద కౌంట్ రొయ్యలకు, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకానప్పుడు మంత్రుల కమిటీ ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు.

Comments