కాకినాడ, నవంబర్ 25 (ప్రజా అమరావతి);
*రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై ప్రత్యేక కథనం*
చెమట చిందించి పంట పండించిన అన్నదాతకు పూర్తి మద్దతు ధర అందించేందుకు వీలుగా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్-2021 సీజన్ నుంచి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలుచేస్తోంది. ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఖరీఫ్ (2022-23) సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ-క్రాప్ బుకింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ఆధారిత సమాచారంతో 263 ఆర్‌బీకేలతో 117 వరకు మిల్లులను అనుసంధానించి.. ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, ఆర్‌బీకే సిబ్బంది కృషిచేస్తున్నారు. గ్రామస్థాయిలో నిబద్ధతతో పనిచేస్తున్న వాలంటీర్లు సైతం ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ముందుగానే జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్ల అసోసియేషన్ల ప్రతినిధులు, పౌర సరఫరాల కార్పొరేషన్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఎఫ్‌సీఐ, తూనికలు-కొలతలు, రవాణా, కార్మిక తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
మిల్లులను ఆర్‌బీకేలతో అనుసంధానించే ప్రక్రియతో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నాణ్యతా ప్రమాణాలు, మద్దతుధరలు తదితరాలపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రచార సామగ్రిని ఆర్‌బీకేల స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు మండలాలకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. క్వింటాకు రూ. 25 చొప్పున హమాలీ ఛార్జీలను, దూరం ఆధారంగా ధాన్యం రవాణా ఛార్జీలను రైతులకు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. అదే విధంగా 75 కిలోల గోనె సంచులకు రూ. 6.33 చొప్పున యూజర్ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ధాన్యం రవాణాకు ఎద్దుల బళ్లను ఉపయోగించుకున్నా సరే ఈ ఛార్జీలను చెల్లిస్తున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులకు ఏవైనా సందేహాలున్నా, సహాయం కావాలన్నా లేదా ఫిర్యాదు చేసేందుకు 8886613611 నంబరును అందుబాటులో ఉంచారు. *ఇప్పటి వరకు 4,828 మంది రైతుల నుంచి రూ. 52.19 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా.. ఇప్పటికే 2,736 మంది రైతులకు రూ. 16.42 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది.*
ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుతం ధాన్యం సేకరణపై రైతుల మనోగతం వారి మాటల్లోనే..
1. *గతంలో ఎప్పుడూ ఇంత తొందరగా డబ్బులు పడలేదు*
- పుణ్యమంతుల వెంకట రమణ, వేములవాడ గ్రామం, కరప మండలం.
మేము దాదాపు 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాం. ధాన్యం అమ్మిన తర్వాత సొమ్ము మూడు రోజుల్లోనే నేరుగా మా ఖాతాల్లో జమ కావడం ఎప్పడూ చూడలేదు. 21 రోజుల్లో ధాన్యం డబ్బులు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అయితే కేవలం మూడు రోజుల్లోనే డబ్బు చేతికందడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ సొమ్ము మా వ్యక్తిగత అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోంది. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు విధానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా క్షేమం కోసం ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
***
2. *ఆర్‌బీకే సిబ్బంది వెన్నంటి ఉన్నారు*
- దాసరి సూర్యనారాయణ, కరప మండలం, కరప గ్రామం.
మాకు ఆరెకరాల పొలం ఉంది. ఇటీవల పంటను మిషన్‌తో కోయించాం. ధాన్యాన్ని శుభ్రంగా ఆరబెట్టుకున్నాం. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సహాయంతో ధాన్యాన్ని విక్రయించాం. 75 కిలోల భస్తాకు రూ. 1,530 మద్దతు ధర లభించింది. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు వెన్నంటి ఉండి ధాన్యాన్ని సజావుగా విక్రయించేలా చేశారు. తేమ శాతం, మద్దతు ధర ఇలాంటి విషయాలన్నీ మాకు వివరించారు. మా బాగు కోసం ఎంతగానో తపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
***
3. *ధాన్యం సేకరణకు మంచి ఏర్పాట్లు చేశారు*
- కొండపల్లి సత్యప్రసాద్, వేట్లపాలెం, సామర్లకోట మండలం.
కోత కోసిన అనంతరం మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆర్‌బీకే సిబ్బందిని అడిగాను. వెంటనే ఆరబెట్టిన మా ధాన్యం శాంపిళ్లను సిబ్బంది పరిశీలించారు. తేమ శాతం 14.7గా ఉందని చెప్పారు. హమాలీలు, ట్రాక్టర్‌ను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నెల 16వ తేదీన ధాన్యం కొనుగోలు పత్రం అందించగా.. 19వ తేదీనే నా ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని అమలుచేస్తున్నందుకు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపుతూ జిల్లాలో ధాన్యం సేకరణకు మంచి ఏర్పాట్లు చేశారు.
***
4. *మాకు అండగా గ్రామ వ్యవసాయ సహాయకులు*
- ముత్యాల వెంకట చౌదరి, హుస్సేనుపురం గ్రామం, సామర్లకోట మండలం.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటివి అందించడంతో పాటు మేము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు
రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు తోడుగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ మేము అడిగిన వెంటనే టెక్నికల్ అసిస్టెంట్ శాంపిల్ తీసి పరీక్షించారు. మా వీఏఏ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఈ నెల 13న ధాన్యం తీసుకెళ్లగా 18వ తేదీన ధాన్యం సొమ్ము మా ఖాతాలో పడింది. ఇంత మంచి విధానాన్ని అమలుచేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
addComments
Post a Comment