నెల్లూరు, నవంబర్ 9 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్లిన ప్రజలు తమ ప్రభుత్వ పాలన పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో నాలుగో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో గ్రామాల్లో ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడి ఆనందంగా జీవించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తమ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు గతంలో ఎవరైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారు ఆర్థిక స్వావలంబన సాధించేలా పనిచేస్తున్నామన్నారు. ఈ మూడేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందాయో తెలుసుకోవడం, అర్హత ఉండి అందకపోతే అందించడం, గ్రామాలకు సంబంధించి ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను చేపట్టడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయాల ద్వారా వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. గ్రామాలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిట్టమూరు అనితమ్మ, ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దారు సుధీర్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment