తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
– పంచమితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు
– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, నవంబరు 11 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఇందుకోసం నవంబరు 19న అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని, ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వివరించారు. పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈసారి ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపుగా వచ్చే మార్గాల్లో అవసరమైన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తిరుపతి ఎస్పీని, కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. పుష్కరిణిలోకి విడతలవారీగా భక్తులను అనుమతిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. పంచమితీర్థం రోజు భద్రతా విధులకు 2500 మంది పోలీసులను వినియోగిస్తామని, వీరికి భోజనం, బస తదితర అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాయని, జెఈవో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఈ సమీక్షలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ మనోహర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment