పేదలకు అండగా ప్రభుత్వం*పేదలకు అండగా ప్రభుత్వం


*


పార్వతీపురం/పాచిపెంట, నవంబరు 29 (ప్రజా అమరావతి): పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంగళ వారం నిర్వహించారు. గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుటకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు. పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి కలిగిన లబ్ధిని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని  ఆయన వివరించారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక రోగంతో మంచం పట్టిన శానాపతి అరుణ (19)ను పరామర్శించారు. ప్రస్తుతం రూ.3 వేలు ఇస్తున్న పింఛను మందులకు సరిపోవడం లేదని కుటుంబ సభ్యులు తెలియజేయగా మెరుగైన వైద్యం అందించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పింఛను పెరుగుదల అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Comments