నవరత్నాలతో పేదల తలరాతలు మారుతున్నాయి: డిప్యూటీ సి.ఎం.

 


నవరత్నాలతో పేదల తలరాతలు మారుతున్నాయి: డిప్యూటీ సి.ఎం.తిరుపతి, నవంబర్ 26 (ప్రజా అమరావతి): గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదల తలరాతలు మారుతున్నాయని ప్రతి కుటుంబంలో సి.ఎం. ను పెద్ద కొడుకుగా భావిస్తున్నారని అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో నవ్వుతూ పనిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి అద్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమీవేశం జరిగింది. సమావేశ ప్రారంభంలో నవంబర్ 26 పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు భారత రాజ్యంగ ప్రస్తావన ప్రతిజ్ఞను చేపట్టారు. అనంతరం  ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. జగనన్న గృహనిర్మాణాలలో ఐదవ స్థానంలో ఉన్నామని, మన బడి నాడు-నేడు పథకం ద్వారా జిల్లాలో 2343 పాఠశాలలకు సంబంధించి మొదటి విడతలో రూ.164 కోట్లతో  862 పాఠశాలలలో వసతులు కల్పించామని, రెండవ విడతలో 1079 పాఠశాలలను రూ.332 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.  పేదప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తూ జిల్లాలో సచివాలయాల పరిధిలో 437 వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు జరుగుతున్నదని, గత మాసం అక్టోబర్ 21 నుండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం ప్రారంభమైందని అన్నారు. వంద సంవత్సరాల తర్వాత జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంతో జిల్లాలోని 69 గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి త్వరలో రైతులకు పత్రాలు అందించనున్నామని మరో 172 గ్రామాలలో రీ సర్వే జరుగుతున్నదని ఏడాదిలోపు పూర్తిచేసి రైతులకు భూ హక్కు పత్రాలు అందజేయనున్నామని అన్నారు. నరేగా నిధులకు సంబందించి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 62,418 మంది రైతులకు సంబంధించి ఈ-క్రాప్, ఈ-కెవైసి 97 శాతం పూర్తి చేశామని దీని వల్ల రైతులకు అందాల్సిన పథకాలు లబ్ది కలుగుతుందని అన్నారు.  జల జీవన్ మిషన్ కార్యక్రమంలో ఇంటింటి త్రాగు నీటి కుళాయి అందించటం 93 శాతం పూర్తి అయిందని అన్నారు. ఇప్పటికే మనం సోమలశిలా – స్వర్ణ ముఖి కెనాల్ కు సంబంధించి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించి కొన్ని పనులు జరిగి ఆగిందని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరు , త్రాగు నీరు అందించే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పాదనలు పంపామని గౌరవ ముఖ్యమంత్రి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్ళి  పరిష్కరించాలని అనుకుంటున్నామని అన్నారు. డి.ఆర్.డి.ఎ.కు సంబంధించి పించన్ల పంపిణీ, వై.ఎస్.ఆర్.భీమా, సున్నా వడ్డీ, చేయూత, జగనన్న తోడు, వై.ఎస్.ఆర్. ఆసరా వంటి పథకాలతో మహిళలు గడప గడప కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  ప్రజల కష్టాలు తెలుసుకుని నవరత్నాల పథకాలతో ముఖ్యమంత్రి పేదప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందేలా చూస్తున్నారని అన్నారు. అధికారులు సమన్వయంతో పథకాల అమలులో మరింత పకడ్బందీగా అమలు చేసి నవ్వుతూ పనిచేయాలని సూచించారు. 


పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన సుధీర్గ పాదయాత్రలో గమనించిన అంశాల మేరకు  తాను  సూచించిన మ్యానిఫెస్టోలో 98 శాతం హామీలను అమలు చేశారని అన్నారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఫ్యామిలీ  డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో సచివాలయాల వద్ద సేవలు అందిస్తున్నామని, కొద్ది సమయం హ్యాబిటేషన్లలో కూడా 104 వాహనం పర్యటించేలా చూడాలని కోరుతున్నారని అన్నారు. జిల్లాలో టూరిజం కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.

 

జిల్లా పరిషత్ చైర్మన్ (ఉమ్మడి చిత్తూరు జిల్లా) శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యకు సంబంధించి మనబడి నాడు-నేడు లో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజా ప్రతినిధులచే ప్రారంభించాలని, రెండవ విడత నాడు- నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రజాప్రతినిధులచే చేపట్టగలిగితే మరింత మెరుగ్గా నిర్మాణాలు సాగుతాయని అన్నారు.


తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి మాట్లాడుతూ సమాచారం కోరిన వెంటనే అధికారులు ఆలస్యం లేకుండా ప్రజాప్రతినిధులకు అందించాలని అన్నారు. సి.ఎస్.ఆర్. నిధులతో ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచే విధంగా చూడాలని కోరారు. అలాగే దివ్యాంగులకు జారీ చేస్తున్న దృవపత్రాలను తాత్కాలికంగా అందిస్తున్నారని వాటిని పూర్తి స్థాయిలో అందించే విధంగా వైద్య శాఖ చూడాలని సూచించారు. 


ఎం.ఎల్.సి. వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ  టిడ్కో గృహాలు త్వరితగతిన లబ్దిదారులకు అందించాలని జాతీయ రహదారులకు సంబంధించి వంతెనల ప్రతిపాదనలు, కృష్ణ పట్నం పోర్టు కు రహదారుల అనుసంధానం చేపట్టాలని కోరారు.


ఎం.ఎల్.సి బల్లికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ 2001 లో ఎస్.టి. లకు గృహాలను మంజూరు చేశారని నేడు అవి చాలా చోట్ల పాడై, పనికి రాకుండా కూలే దిశలో ఉన్నాయని పేదలు అదే గృహాలలో నివాసాలు ఉంటున్నారని వారికి కొత్త గృహాలను మంజూరు చేసేందుకు పరిశీలించాలని కోరారు. సముద్ర తీరప్రాంత గ్రామాలలో పాడిన రోడ్లను పునరుద్దరించాలని కోరారు. 


చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వారి భాదలను అవసరాలను తీర్చాల్సిన భాద్యత మీరు, మేము, మనం ఒక టీం గా  పనిచేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని  అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులకు 148 జి.ఓ  మేరకు గౌరవం ఇస్తూ అడిగిన  సమాచారం త్వరగా అధికారులు అందించాలని అన్నారు. దీనివల్ల సంస్కరణలలో, అభివృద్ధిలో తపన పడుతున్న గౌ.ముఖ్యమంత్రి ఆలోచనకు మనం న్యాయం చేసిన వాళ్ళం అన్నారు. 


శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తరచూ పర్యటించాలని పథకాల ప్రయవేక్షణ ఉండాలని అన్నారు. నాడు –నేడు, రీ సర్వే వంటి మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయని  అన్నారు. ప్రధానంగా వైద్య శాఖ పనితీరు మరింత మెరుగుపడాలని సూచించారు. 


వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అసైన్ ల్యాండ్ జగనన్న కాలనీలకు అడిగిన వెంటనే పరిహారం లేకుండా  వెంకటగిరి లో 97 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పినా దాదాపు 200 మందికి రెండు సెంట్లు వంతున అందించగలిగితే మానవత్వం చాటుకున్న వాల్లమవుతామని అన్నారు. టిడ్కో ఇళ్ళకు సంబంధించి రెండవ దశ వాటిని నిర్దేశించిన మార్చి 2023 కు కాకుండా త్వరగా అందించగలిగితే లబ్దిదారులకు మేలు కలుగుతుందని అన్నారు. జిల్లా విభజన అనంతరం వెంకటగిరి పరిధిలోని మూడు రూరల్ మండలాలను తుడా పరిధిలోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. అందరికీ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి తపన మేరకు మండల పరిధిలో మంజూరైన రెండు పి.హెచ్.సి కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని వివరించారు. 


ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జే.సి. డి.కె. బాలాజీ, నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు,  ఆర్.డి.ఓ లు తిరుపతి కనకనరసా రెడ్డి, సూళ్ళూరుపేట రోజ్ మాండ్,  గూడూరు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి రామారావు, ముఖ్య ప్రణాళికా అధికారి అశోక్ కుమార్, పి.డి. హౌసింగ్ చంద్రశేఖర్ బాబు, మెప్మా పి.డి. రాధమ్మ, డి.ఈ.ఓ. శేఖర్, ఎల్.డి.ఎం శుబాష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Comments