వివక్షకు ఏమాత్రం తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోంది.


అమరావతి (ప్రజా అమరావతి);


*విశాఖపట్నం జిల్లా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.*


*నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం.* 


*సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.*


*వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో వివరించిన ముఖ్యమంత్రి.* 


*– ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..*


ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం మీకు తెలుసు.

వారానికి కనీసం రెండు నియోజకవర్గాల్లో కేడర్‌ని పిలిచి వారితో మాట్లాడుతున్నాం.

ప్రతి ఒక్కరితో కనీసం ఒకట్రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం. వాళ్ల భావాలను కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాం.

ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి కదా ? అని చాలమంది అనుకోవచ్చు. 

మరో 16 నెలల్లో  ఎన్నికలు రానున్నాయి. దానికి సన్నద్ధం కావల్సి ఉంది.

16 నెలలంటే చాలా కాలం ఉంది కదా ? అప్పుడెప్పుడో చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడేనా అనుకోవచ్చు. 


ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే.. రెండు కారణాలున్నాయి.  

మనం కలిసి చాలా రోజులైంది. కలిసినట్టు ఉంటుంది. ఇది మొదటి కారణం అయితే.. రెండో కారణం.. మనం గడప గడపకూ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రతి వార్డులోకి, ప్రతి ఇంటిదగ్గరకి తీసుకునిపోతున్నాం. ఇందులో మీ అందరి భాగస్వామ్యం ఎంతోఅవసరం, ముఖ్యం. 


ఎందుకంటే.. మనం ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే.. ఇంత పారదర్శకంగా, వివక్షకు, అవినీతికి తావులేకుండా.. పథకాలు గతంలో ఏ రోజూ కూడా సామాన్యుడి దగ్గరకి పోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతుంది. వివక్షకు ఏమాత్రం తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోంది.



సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను తీసుకునిరాగలిగాం. వాటితో పాటు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతం పై చిలుకు హామీలను నెరవేర్చాం. అలా నెరవేర్చిన తర్వాత ప్రజలకు దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 కు 175 నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితిలు గుర్తుచేయడానికే ఈ సమావేశం. 


175 కు 175 మనం అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ?.

కారణం ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది. కుప్పంలాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్‌ స్వీప్‌ చేశాం. 

మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలు కూడా  అన్నీ అలానే గెల్చుకున్నాం. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. 

కారణం ప్రతి ఇంటిలో కూడా సంక్షేమం, అభివృద్ధి అన్నది కనిపిస్తోంది. పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయి. ప్రతి ఇంటికీ మేలు జరుగుతోంది. 


ఇవే కాకుండా మన గ్రామాల్లో మారుతున్న బడులు, ఆసుపత్రులు, ఆర్బీకేలు, పట్టణాల్లో అర్భన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. రాబోయో రోజుల్లో డిజిటల్‌ లైబ్రరీలు కూడా రానున్నాయి.


విశాఖపట్నం రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం. ఈ నగరంలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. అంత పారదర్శకత కనిపిస్తోంది. 


ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనమంతా ఆలోచన చేయాలి. ఎందుకు 175కి 175 సాధ్యం కాదు. ఇది కావాలంటే రెండు జరగాలి. ఒకటి నేను చేయాల్సిన పని నేను చేయాలి. ఎక్కడ తప్పు జరగక్కుండా...కచ్చితంగా క్యాలెండర్‌ ప్రకారం నెల, నెలా బటన్‌ నొక్కడం నేను చేయాలి. ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ అన్నదానికి నిర్వచనం మార్చాం. 


గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్‌ ప్రకారం జరగలేదు. అదే విధంగా నేను చేయాల్సిన పని నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. నాకు ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి ప్రజల సమస్యలను నా సమస్యలు కన్నా ఎక్కువని గమనించి... వాటిని తీర్చే విధంగా బటన్‌ నొక్కే కార్యక్రమం నేను చేయాలి. అదే విధంగా మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ఈ రెండూ జరగాలి.


మీరు కచ్చితంగా ప్రతిగడపకూ వెళ్లాలి. ప్రతి గడపలో మనం చేస్తున్న పనులకి సంబంధించి వివరాలతో సహా వెళ్తున్నారు. ఆ ఇంట్లో అక్క, చెల్లెమ్మ పేరుతో జరిగిన మంచిని వారికి వివరిస్తూ... గుర్తు చేస్తూ... ప్రజల ఆశీస్సులు కూడా తీసుకోవాలి. అంతే కాకుండా ఆ వార్డులో  జన్యూన్‌ కారణాలతో ఎవరైనా మిస్‌ అయితే... వాటిని కూడా పరిష్కరించాలి. 

ఆ విధంగా మమేకం కావాలి. 


చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం దగ్గరుండి పరిష్కరించి వాటిని లేకుండా చేయాలి. ఇలా నేను చేయాల్సింది నేను, మీరు చేయాల్సింది మీరు..ఈ రెండింటి కాంబినేషన్‌ జరిగితే 175 కి 175 వై నాట్‌ ? ఇది కచ్చితంగా జరగాలి.

అందరూ కలిసి ఒక లక్ష్యంతో పనిచేయాలి. ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే... ఆ తర్వాత 30 యేళ్లు పాటు మనమే ఉంటాం.


మనం చేసే మంచి కూడా కనిపిస్తుంది. స్కూళ్లు మారుతున్నాయి. ఆసుపత్రులు మారుతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయం చేసే తీరు మారుతుంది. డిజిటల్‌ లైబ్రరీలు వస్తాయి. మొత్తంగా మనం వేస్తున్న అడుగులు ప్రతిఫలాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒకవైపు రూపురేఖలు మారుతాయి.. ప్రభుత్వంలో పారదర్శకత వల్ల ప్రతి ఇంటికి పథకాలు చేరుతాయి.  


ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తూ మరో 30 యేళ్లు మనమే ఉండాలని దీవిస్తారు.

 ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలి. 


మనం నలుగురికి మంచి చేయాలంటే.. మనం అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం. ఇవాల వ్యవస్ధలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే మనందరం కలిసికట్టుగా అడుగులు వేయాలి. 


–ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు.

Comments