రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఘన నివాళులు
కల్లెక్టరేట్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు – జాతీయ జెండా ఎగుర వేసిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 01 (ప్రజా అమరావతి):
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఎంతటి ప్రాముఖ్యత వుందో రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కూడా అంతే ప్రాముఖ్యత వుందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, ఎమ్మెల్సీ పెన్మత్స సురేష్ బాబు తదితరులతో కలసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా తమిళుల అజమాయిషీలో మన ప్రాంతమంతా వుండేదని, అయితే అధిక జనాభా, ఎక్కువ ప్రాంతంలో వున్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండు రావడంతో దానికోసం పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడంతో మన రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. అయితే ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆటంకాలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు పి.వి.వి.సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు), జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు తదితరులు పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి చిత్రపటాలకు నివాళులర్పించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తదితరులు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో అమరజీవికి ఘనంగా నివాళులర్పించారు.
అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్సీ సురేష్‌బాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా అధికారులు విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment