ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలి

 


*ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలి


*


పార్వతీపురం, నవంబరు 30 (ప్రజా అమరావతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం పార్వతీపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో పార్వతీపురం మన్యం జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుటకు అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. సమస్యలు ఉంటే వాటిని ముఖ్య మంత్రి, సంబంధిత శాఖల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళతానని ఆయన పేర్కొన్నారు. 


జాయింట్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ బ్యాంకు గారంటీలు రావలసి ఉన్నాయన్నారు. జిల్లాలో 15 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు గల మౌళిక సదుపాయాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగిన గోనె సంచులు కూడా లభ్యంగా ఉన్నాయని చెప్పారు. 


పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. దేవుళ్ల నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 3,18,734 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ లోకి వస్తుందని అంచనాలు వేసామన్నారు. 1.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. జిల్లాలో 306 రైతు భరోసా కేంద్రాలు ఉండగా ఏ, బి, సి కేటగిరీలలో 188 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇందులో పి.ఏ.సి ల ఆధ్వర్యంలో 106, గిరి వెలుగు ఆధ్వర్యంలో 12, జిసిసి ఆధ్వర్యంలో 19, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 4, రైతు ఉత్పాదక సంఘం (ఎఫ్.పి.ఓ) ఆధ్వర్యంలో 47 ఉన్నాయని తెలిపారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలు చూసే పరికరాలను సరఫరా చేసామని చెప్పారు. జిల్లాలో 47.75 లక్షల గోనె సంచులు అవసరమని, 8,86,465 గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రైస్ మిల్లర్ల సంఘం 10 లక్షల గోనె సంచులు కొనుగోలుకు అంగీకరించిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1,10,473 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సరిపడా గిడ్డంగులు ఉన్నాయని వివరించారు. 7 వేయింగ్ బ్రిడ్జిలు జిల్లాలో ఉన్నాయని, కొత్తగా 19 బ్రిడ్జి లను ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. జిల్లాలో 39 సార్టెక్స్ రైస్ మిల్లులు, 9 నాన్ సార్టేక్స్ ఫోర్టీఫైడ్, 47 నాన్ సార్టెక్స్ మిల్లులు ఉన్నాయని, 90 రోజుల కాలంలో 2,89,440 మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలుపై రైతులు అందరికీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. రవాణా, హమాలీ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సీతానగరం, బలిజిపేట, పాలకొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అయిందని, రెండు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 


ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ బి. గౌరీశ్వరి , జిల్లా సరఫరాధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా సహకార అధికారి బి. సన్యాసి నాయుడు, గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్ర కుమార్, వెలుగు ఏపీడి వై. సత్యం నాయుడు,  రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తకోట రమేష్,  జిల్లా టాక్స్ అడ్వైజర్ గంటా అబ్బాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments