భూహక్కు పత్రాలు సిద్ధం కావాలి
- సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్
-
పుట్టపర్తి, నవంబర్ 10 (ప్రజా అమరావతి): జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చెందిన పనులన్నీ పూర్తిచేసి పత్రాలు సిద్ధం చేయాలని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి మరియు ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తో కలిసి సంయుక్తంగా జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తవుతుందని, సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. సమగ్ర సర్వే పూర్తయిన 2వేల గ్రామాలకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూహక్కు పత్రాలను పంపిణీచేసే అవకాశముందని అన్నారు. భూహక్కు- భూరక్ష పత్రాలు మంజూరుచేయబోయే పట్టదారుల వివరాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి తమకు పంపాలని కోరారు. సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన ముసాయిదాను తొలుత ప్రచురించాలని, ప్రచురించిన ముసాయిదాపై కలెక్టర్లు నాలుగైదు రోజుల్లో నిశితంగా పరిశీలించి, మార్పులు, చేర్పుల జాబితాను ప్రక్కనపెట్టి తుది జాబితాను తమకు పంపాలని అన్నారు. ఆ జాబితా ఆధారంగా జగనన్న భూహక్కు- భూరక్ష పత్రాలు సిద్ధం అవుతాయని తెలిపారు. భూహక్కు పత్రాలలో ప్రచురణే కొలమానం అయినందున క్షుణ్ణంగా పరిశీలించిన పిదపే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ప్రస్తుతం మంజూరుచేయబోయే గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలన్నీ రానున్న రోజుల్లో సర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాల పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. గడువులోగా మ్యుటేషన్లు, వివాద స్థలాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్,జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment