ప్రజల్లో చైతన్యం రావాలి

 *ప్రజల్లో చైతన్యం రావాలి**ఈ రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం*


**వివేకాను ఎవరు..ఎందుకు చంపారో జగన్‌రెడ్డి చెప్పాలి*


*తెలుగు దేశం పార్టీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు*


*విజయరాయిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు*


*ఏలూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు : కలపర్రు టోల్‌గేట్‌ వద్ద ఘనస్వాగతం*


దెందులూరు (ప్రజా అమరావతి)  : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా విజయరాయిలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. అనంతరం ఆయన 'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్‌రెడ్డి కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మీటింగ్‌లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని,  ప్రజల్లో చైతన్యం రావాలని,  ధైర్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని,  అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయ్‌ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని, ఇప్పుడు లోకేష్‌ని లక్ష్యంగా చేసుకున్నారట. తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌కు పోలీసులుంటే తనకు ప్రజలు ఉన్నారన్నారు. కోతలతో విద్యా దీవెన అమలు చేస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండర్ అంటూ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు నేటికీ పునరావాసం లేదన్నారు. గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి తెచ్చారని, రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.75 లక్షల తలసరి అప్పు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా 'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం మొత్తం 8వేల మంది పార్టీ బృందాలను నియమించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం, ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు 7, 8 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దాంతో పోలిస్తే ఇదేం కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు.

 


వైఎస్‌ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? : వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని తెలుగు దేశం పార్టీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు  అన్నారు. వైఎస్‌ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా అని నిలదీశారు. ఏలూరు జిల్లా  దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ‘‘ఎన్నికల్లో వైసీపీ  గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం  ముంచేస్తారని ఆనాడే ప్రజలకు వివరించా. ముద్దులు పెడుతున్నాడని మోసపోవద్దని, గెలిచిన తర్వాత పిడిగుద్దులుంటాయని స్పష్టంగా చెప్పా. ఆనాడు నేను చెప్పిందే ఇవాళ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. అందుకే ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ అని కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రజలు ఇప్పుడైనా నా మాట వింటారని. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది. నాకు కాదు. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశాను. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే పదవితో పనిలేదు. ఈ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి. ధైర్యంగా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు.


భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుంది. టీడీపీ  హయాంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఇప్పుడున్న మంత్రికి డయాఫ్రం వాల్‌ అంటే ఏంటో కూడా తెలీదు. ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నారు. నా బాధంతా రాష్ట్రం కోసమే. నెలకొక్కసారి పోలవరం వచ్చేవాడిని. సోమవారం పోలవరంగా మార్చాను. సమీక్షలు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించా. గేట్లు పెట్టేంతవరకు పనులు పూర్తి చేయించాను. సీఎంగా ప్రమాణం చేసిన రోజునే రివర్స్‌ టెండర్ అని తీసుకొచ్చి పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డబ్బుల కోసం కాంట్రాక్టర్లను మార్చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేది. ఇప్పుడు పోలవరం పూర్తి కాకపోవడానికి నేనే కారణమని అంటున్నారు. అబద్ధాలు చెప్పడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మూడున్నరేళ్లుగా ఒకటే పని చేస్తున్నారు. అమాయకులపై కేసులు పెట్టి వేధించడం. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది’’ అని చంద్రబాబు అన్నారు.


విజయరాయి వరకూ భారీ రోడ్ షో  : దెందులూరు నియోజకవర్గం విజయరాయికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు.  కలపర్రు టోల్ ప్లాజా నుంచి విజయరాయి వరకూ భారీ రోడ్ షో జరిగింది. చంద్రబాబు కాన్వాయ్ చుట్టూ వేలాది మంది యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ, ట్రాక్టర్ల ర్యాలీ ని నిర్వహించారు.

Comments