రైతు సంక్షేమమే జగనన్న ధ్యేయం - మంత్రి జోగి రమేష్



గూడూరు(మల్లవోలు/ముదిరాజుపాలెం) : నవంబర్ 19 (ప్రజా అమరావతి);


రైతు సంక్షేమమే జగనన్న ధ్యేయం - మంత్రి జోగి రమేష్



రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణా శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.


శనివారం గూడూరు మండలం, మల్లవోలు గ్రామంలో రూ.28.85 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును ఆయన బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలసి ప్రారంభోత్సవం చేశారు.


ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి రైతును రాజును చేయడానికి కృషి చేస్తే నేడు ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతును రారాజుగా చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గతంలోని సొసైటీ లావాదేవీలు రూ.15 కోట్ల నుంచి నేడు రూ.35 కోట్ల వరకు పెరిగిందని, తద్వారా ప్రతి రైతుకు రుణాలను అందించేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రానున్న రోజుల్లో ఈ ప్రాంత రైతులు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి నిర్విరామ కృషి చేస్తున్నారని. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన కృషి మరువలేనిదని మంత్రి కొనియాడారు.


బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ సహకార బ్యాంకులను కంప్యూటరీకరణ చేయడమే కాకుండా మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులను వెచ్చిస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతుతో పాటు కౌలు రైతులైన ఏ ఒక్కరిని నిరాశ పరచకుండా రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత సహకార బ్యాంకులదేనని అన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి త్వరలో అడుగులు పడనున్నాయని అందుకు సంబంధించిన రూ.3.940 కోట్లు మంజూరు చేయడానికి బ్యాంకుల నుంచి ఆమోదం లభించిందన్నారు. రామన్న కాలంలో కృష్ణా డెల్టా ప్రాంతంలో పండే వరిని బందరు పోర్టు ద్వారా ఎగుమతులు ప్రారంభించడానికి సమీపంలో ఉన్నామని, తద్వారా రైతులు ఆర్థికంగా ఎదగడానికి కార్యరూపం దాల్చనున్నదన్నారు. సాగరమాల పథకం ద్వారా పోర్టు కనెక్టివిటీకి కార్యాచరణను రూపొందించామన్నారు. బందరు పోర్టు నిర్మాణంతో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ద్వారా వేల మందికి ఉపాధి కల్పనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు.


ముదిరాజుపాలెంలో నూతన విద్యుత్ వీధిదీపాలను ప్రారంభించిన మంత్రి :


గూడూరు మండలం మల్లవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లవోలు, ముదిరాజుపాలెంలో రూ.16 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల విద్యుత్కరణను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభ నేని బాలశౌరితో కలసి ప్రారంభించారు. పాతస్థంబాల స్థానంలో కొత్త స్థంబాలను ప్రతిష్టించడంతో పాటు వీధిలైట్లు. విద్యుత్ తీగలను ఏర్పాటు చేయడానికి నిధులను వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. పనులను సకాలంలో పూర్తిచేసిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్


అధికారులను ఆయన అభినందించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సహాయం చేయాలని గ్రామానికి చెందిన మహిళలు ఎంపీని అభ్యర్థించగా, అందుకు సిఐఎస్ఆర్ నిధులను మంజూరు చేయిస్తామని, ఇందు నిమిత్తం అంచనాలను రూపొందించాలని గూడూరు ఎంపీడీఓ డి. సుబ్బారావును ఎంపీ ఆదేశించారు. ఎంపీ హామీ పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ సూర్యప్రకాశరావు. జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, రాష్ట్ర ఎస్ఎఫ్ఎసీ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు. ఎంపీపీలు సంగా మధుసూధనరావు, వెలివెల చిన్నబాబు, పీఏసీఎస్ అధ్యక్షులు డి.రమేష్. 3వ వార్డు కౌన్సిలర్ బి. గంగయ్య. గ్రామ సర్పంచ్ బి. సాంబశివయ్య. డిప్యూటీ ఈఈ కె.రామకృష్ణ, ఏఈ ఎం.రాజేష్ కుమార్. వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ఎం.రాజబాబు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకట కృష్ణారావు, ఎంపీటీసీ పిట్ల రామిరెడ్డి, పిఎసిఎస్ మెంబరు శివపార్వతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.



Comments