*కోవిడ్ మాక్ డ్రిల్ పరిశీలించిన జిల్లా కలెక్టర్


*


పార్వతీపురం, డిసెంబరు 27 (ప్రజా అమరావతి ): కోవిడ్ నాలుగవ దశ వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళ వారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన  మాక్ డ్రిల్ ను పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. కోవిడ్ చికిత్సకు ప్రత్యేక గదులు, అత్యవసర విభాగం, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్షిజన్ కాన్సన్ట్రేటర్లు , మందుల నిల్వను ప్రత్యేకంగా పరిశీలించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బెడ్ ల ఏర్పాటుపై ఆసుపత్రి సూపరిండెంట్ డా.బి.వాగ్దేవి ని అడిగితెలసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కోవిడ్ ఒమెక్రాన్ కొత్త వేరియంట్ వైరస్ ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు అన్ని జిల్లా ఆసుపత్రి, సి.హెచ్.సి, పి హెచ్ సి లలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందిని నియమించాలని సూచించారు. ఎంత మంది కోవిడ్ రోగులకు ఆక్సిజన్ ద్వారా చికిత్స అందిస్తున్నది, ఉన్న నిల్వలు, అవసరమైన ఆక్సిజన్ ను రప్పించే ఏర్పాట్లను పక్కగా నిర్వహించాలన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. వెయ్యి ఎల్.పి.టి సామర్థ్యం గల ఆక్సిజన్ యూనిట్ ను పరిశీలించారు. పల్స్ ఆక్సి మీటర్ ద్వారా స్వయంగా పల్స్ ను పరిశీలించుకున్నారు. అవసరమైన మందులను సెంట్రల్ డ్రగ్ కు పంపాలని అన్నారు. కోవిడ్ వేవ్ వచ్చినా ప్రిసైడింగ్ అధికారులను నియమించి నిరంతరం వైద్య సేవలపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ వినియోగించాలని, సానిటైజెర్ వాడకం, చేతులు శుభ్రంగా కడుక్కోడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో వైద్యులు డా. లక్ష్మణ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments