3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్ధానంలో ఆంధ్రప్రదేశ్విజయవాడ (ప్రజా అమరావతి);*3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్ధానంలో ఆంధ్రప్రదేశ్


*


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 లో అతిథ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 789 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో ఆగ్రస్థానాన నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 780 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, మధ్యప్రదేశ్ 3వ స్థానం కైవసం చేసుకుంది. గత శనివారం (డిసెంబర్ 17న) ఘనంగా  ప్రారంభమైన 3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 క్రీడాకారుల కేరింతలు, విజయోత్సవ, ఆనందాల మధ్య పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అతిథ్య రాష్ట్రంగా విజయవాడ, గుంటూరులోని వివిధ వేదికల వద్ద ఈ క్రీడలను నిర్వహించినప్పటికీ..  ప్రారంభ వేడుకలు నిర్వహించిన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికలోనే ముగింపు వేడుకలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి(గిరిజన సంక్షేమం) పీడిక రాజన్న దొర హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం చాంపియన్ లకు ట్రోఫిలను ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అందజేశారు. 

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ.. 22 క్రీడాంశాలలో ఛాంపియన్ లుగా నిలిచిన వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.  ఈ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభించినందుకు సంతోషంగా ఉందని, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 22 రాష్ట్రాలకు చెందిన దాదాపు 4,300 మంది క్రీడాకారులు 6 రోజుల పాటు ఈ క్రీడల్లో పాల్గొన్నారని, ఆటల్లో  గొప్ప క్రీడాస్ఫూర్తిని, స్నేహాన్ని ప్రదర్శించిన ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుచుకోవడం మరింత సంతోషాన్నిస్తుందని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చిన మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని చాలా గర్వంగా ప్రకటించడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. రెండవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం,  3వ స్థానంలో  మధ్యప్రదేశ్ నిలిచాయని ప్రకటించారు. క్రీడాకారులు మరియు జట్లు ఒకరినొకరు ఒకే కుటుంబంలా చూసుకోవడంతో ఈ ఈవెంట్ క్రీడాకారుల నిజమైన స్ఫూర్తిని చూపించిందన్నారు. మూడు సంవత్సరాల కోవిడ్ -19 మహమ్మారి తర్వాత నిర్వహించిన ఈ ఈవెంట్, ప్రతి క్రీడాకారుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కేంద్రం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారం మరువలేనిదన్నారు. జాతీయ క్రీడలు-2022 నిర్వహణ కోసం త‌క్కువ స‌మ‌యంలో దాదాపు 7000 మందికి అన్ని స‌దుపాయాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ముఖ్యమంత్రి  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  సమర్ధవంతమైన నాయకత్వంలో అంకితభావంతో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ క్రీడలకు సంబంధించి సహకరించిన ప్రతి శాఖను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రత్యేకంగా అభినందించారు.    

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎమ్.జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.


*బాలురు అండ‌ర్-19, బాలిక‌ల అండ‌ర్-19 విభాగంలో విజేత‌ల వివ‌రాలు..*

బాస్కెట్ బాల్ అండ‌ర్19 బాలుర విభాగంలో మొద‌టి స్థానంలో సిక్కిం, రెండో స్థానంలో మిజోరాం, మూడోస్థానంలో మణిపూర్ నిలిచాయి.

ఫుట్ బాల్ అండ‌ర్ 19 బాలుర విభాగంలో మొద‌టి స్థానంలో జార్ఖండ్, రెండో స్థానంలో మ‌ణిపూర్, మూడోస్థానంలో వెస్ట్ బెంగాల్ సత్తా చాటాయి.

ఫుట్ బాల్ అండ‌ర్ 19 బాలిక‌ల‌ విభాగంలో మొద‌టి స్థానంలో జార్ఖండ్, రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్, మూడోస్థానంలో సిక్కిం నిలిచాయి.

హ్యాండ్ బాల్ అండ‌ర్ 19 బాలుర విభాగంలో మొద‌టి స్థానంలో ఆంధ్ర‌ప్రదేశ్, రెండోస్థానంలో తెలంగాణ‌, మూడోస్థానంలో ఛ‌త్తీస్ గ‌డ్ పొందాయి.

హ్యాండ్ బాల్ అండర్ 19 బాలిక‌ల విభాగంలో మొద‌టిస్థానంలో మ‌ధ్య‌ప్రదేశ్, రెండోస్థానంలో తెలంగాణ‌, మూడోస్థానంలో గుజ‌రాత్ నిలిచాయి.

హాకీ అండ‌ర్19 బాలుర విభాగంలో మొద‌టిస్థానంలో ఒడిశా, రెండోస్థానంలో గుజ‌రాత్, మూడోస్థానంలో తెలంగాణ‌ నిలిచాయి.

హాకీ అండ‌ర్19 బాలిక‌ల‌ విభాగంలో మొద‌టిస్థానంలో మ‌హారాష్ట్ర‌, రెండోస్థానంలో ఒడిశా, మూడోస్థానంలో గుజ‌రాత్ కైవసం చేసుకున్నాయి.

క‌బ‌డ్డీ అండ‌ర్ 19 బాలుర విభాగంలో మొద‌టి స్థానంలో తెలంగాణ‌, రెండోస్థానంలో ఉత్త‌రాఖండ్, మూడోస్థానంలో ఛ‌త్తీస్ గ‌డ్ నిలిచాయి.

క‌బ‌డ్డీ అండ‌ర్ 19 బాలిక‌ల‌ విభాగంలో మొద‌టి స్థానంలో క‌ర్ణాట‌క‌, రెండోస్థానంలో తెలంగాణ‌, మూడోస్థానంలో ఒడిశా నిలిచాయి.

ఖోఖో అండ‌ర్ 19 బాలుర విభాగంలో మొద‌టిస్థానంలో ఛ‌త్తీస్ గ‌డ్, రెండోస్థానంలో ఆంధ్ర‌ప్రదేశ్, మూడోస్థానంలో తెలంగాణ‌ నిలిచాయి.

ఖోఖో అండ‌ర్ 19 బాలిక‌ల‌ విభాగంలో మొద‌టి స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, రెండోస్థానంలో మ‌హారాష్ట్ర‌, మూడోస్థానంలో ఛ‌త్తీస్ గ‌డ్ నిలిచాయి..

వాలీబాల్ అండ‌ర్ 19 బాలుర విభాగంలో మొద‌టిస్థానంలో ఆంధ్ర‌ప్రదేశ్, రెండోస్థానంలో త‌మిళ‌నాడు, మూడోస్థానంలో తెలంగాణ‌ నిలిచాయి.

వాలీబాల్ అండ‌ర్ 19 బాలిక‌ల‌ విభాగంలో మొద‌టిస్థానంలో తెలంగాణ‌, రెండోస్థానంలో మ‌ణిపూర్, మూడోస్థానంలో ఆంధ్ర‌ప్రదేశ్ నిలిచాయి.Comments