తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికే ఈ సంబరాలు


విజయవాడ (ప్రజా అమరావతి);


ఘనంగా ప్రారంభమైన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల రాష్ట్ర స్థాయి పోటీలు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికే ఈ సంబరాలు



నేను కూడా కళాకారుల కుటుంబ సభ్యురాలినే.. 

మంగళవారం జబర్దస్త్ టీంతో విజేతలకు బహుమతుల ప్రదానం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్. కె. రోజా వెల్లడి. 

లంబాడీ బృందంతో కలిసి నృత్యం చేసిన మంత్రి 


తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, కళలు & కళాకారుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. ఈ సంబరాల్లో భాగంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభానికి సోమవారం మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు వేదిక ప్రాంగణంలో  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబంపై ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’ ను ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం వేదికలుగా నాలుగు జోన్లలో పాత, క్రొత్త కళాకారుల సమ్మేళనంతో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు ఎటువంటి ఢోకా లేదని, కళలు ఎప్పటికీ బతికే ఉంటాయన్న నమ్మకాన్ని కలుగజేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులను గుర్తించడంతో పాటు, వారికి ప్రభుత్వం నుండి అందవలసిన పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం, తర్వాతి ప్రభుత్వ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించడం, కళాకారులకు అందించే రాయితీ వారికి కూడా వర్తింపజేయడం, కళాకారుల వివరాలను నిక్షిప్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు.   నాలుగు జోన్లలో ప్రతిభ కనబర్చిన వారికి విజయవాడలో డిసెంబర్ 19, 20వ తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రస్థాయిలో ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఫైనల్ పోటీల్లో విజేతలకు 20వ తేది మంగళవారం నాడు జబర్థస్త్ టీం హైపర్ ఆది, అభి, చంటి, ఆటో రాంప్రసాద్, అనసూయల చేతులుగా బహుమానం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఎంత టాలెంట్ ఉన్నా ప్రోత్సాహం, గుర్తింపు ఉండాలన్నారు. తాను కూడా కళాకారుల కుటుంబ సభ్యురాలినే అని అన్నారు. ఈ సంబరాలను నిర్వహించడం ద్వారా తమ కాలేజీ రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయని తెలిపారు. మన కళలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని తెలియజేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఒక ప్రత్యేకతతో నిర్వహించాలనుకున్నానని తెలిపారు. అందుకోసం మొదటి పుట్టినరోజున పుష్ప అనే అమ్మాయిని మంత్రి దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రెండో సంవత్సరం ఒక గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకున్నామన్నారు. ఈ సంవత్సరంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా.. మన సంస్కృతి, సంప్రదాయాలు ఫరిడవిల్లేలా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను నిర్వహించామని తెలిపారు. జగనన్న నాలుగు జోన్లలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో ఎంతో మంది కళాకారులను గుర్తించామన్నారు. ఏపీ కళాకారులంటే ఆషా మాషీ కాదు... అద్భుతమైన టాలెంట్ ఉన్నవారని అందరికీ తెలిసిందే అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఈ ఫైనల్స్ లో విజేతలను గుర్తించడం న్యాయనిర్ణేతలకు చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. మొత్తం ఈ కార్యక్రమం అంతా ఒక డాక్యుమెంటరీ రూపంలో తయారుచేసి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు కానుకగా అందిస్తామని తెలిపారు.  ఈ పోటీల్లో కుచిపూడి, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, గాత్రం వంటి సాంప్రదాయ నృత్యరీతులు నిర్వహించామన్నారు. జానపద కళారూపాలైన డప్పులు, గరగలు, తప్పెటగుళ్లు, చెక్కభజన, పులివేషాలు, బుట్ట బొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు.. అలాగే గిరిజన కళారూపాలైన ధింసా, కొమ్ముకోయ, సవర, లంబాడీ వంటి తదితర విభాగాల్లో జోనల్ స్థాయి, రాష్ట్ర పోటీలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ప్రతీ విభాగంలో జోనల్ స్థాయి విజేతలకు గ్రూపుకి రూ.25 వేలు, సోలోకి రూ.10 వేలు చొప్పున బహుమానం. రాష్ట్రస్థాయి విజేతలకు గ్రూపుకి లక్ష రూపాయలు, సోలోకి యాబై వేలు చొప్పున బహుమతిగా అందజేస్తామని మంత్రి రోజా తెలిపారు.


గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించేందుకే జగనన్న స్వర్ణోత్సోవ సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎక్కడో ఒక మూలన మిగిలే ఉన్నాయన్నారు. సాంస్కృతిక స్వర్ణోత్సవ సంబరాల పేరుతో వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్న మంత్రి రోజాకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. యావత్ ప్రపంచం అంతా కుచిపూడి నృత్యం చూస్తూ పరవశులు అవుతున్నారన్నారు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం కృష్ణా జిల్లాలో పుట్టిందని, అది మనందరికీ గర్వకారణమన్నారు. వివిధ కళలను పది కాలాల పాటు వర్థిల్లాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని మంత్రి జోగి రమేష్ ఆకాక్షించారు.


ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కళాకారులందరికీ అభినందనలు తెలియజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ... మారుతున్న కాలక్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న సమయంలో వాటి అన్నింటిని కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి వర్ధిల్లాలని, అప్పుడే సమాజంలో విలువలు ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వంలో కళాకారులకు అంతా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. ఆట, మాట, పాట ద్వారా లక్షలాది మందిలో చైతన్యం రగిలించి మార్చవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వంగపండు రచించిన ఏం పిల్లడో వెళ్దాం వస్తామా..? పాటను పాడారు. 


ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్.పి. భారతి, పెద్ద సంఖ్యలో కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా నాట్య విభాగానికి కళారత్న కె.వి సత్యనారాయణ, శారద రామకృష్ణ,  సంగీత విభాగానికి కళారత్న మోదుమూడి సుధాకర్, జానపద కళారూపాల విభాగానికి ఉమామహేశ్వర పాత్రుడు, కలి లు వ్యవహరించారు. 


కుచిపూడి నాట్యంతో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం.. లంబాడి బృందంతో మంత్రి రోజా నృత్యం..

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి పోటీలు ఎల్. సుశ్మిత బృందం వారిచే కుచిపూడి నృత్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం కాళికా మాత నృత్యప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో తేళ్లు, నాగపాముతో కళాకారులు చేసిన ప్రదర్శన వీక్షకుల మన్ననలు పొందాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జోషిక శివునిపై జానపదం గానంతో అలరించింది. డి. ద్వారతి బృందంతో లంబాడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సంస్కృతి, సంప్రదాయలను కాపాడేలా బంజారా కళాకారులు వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనులను నృత్యరూపం చేస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. స్టేజి కింద నుండి వీక్షిస్తున్న మంత్రి రోజా.. వెంటనే స్టేజి పైకి వెళ్లి లంబాడి బృందంతో నృత్యం చేశారు. బృందంలోని ప్రతి కళాకారిణికి షేక్ హ్యాండ్ ఇచ్చి మంత్రి రోజా అభినందనలు తెలిపారు. 



Comments