పేరుకే వైసీపీలో బీసీలకు పదవులు..పెత్తనమంతా అగ్రకులాలదే

 *బీసీలను అణగదొక్కిన జగన్*


*పేరుకే వైసీపీలో బీసీలకు పదవులు..పెత్తనమంతా అగ్రకులాలదే


*


*బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు*


*టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే బీసీలకు ముష్టి మూడు పదవులు ఇచ్చాడు*


*140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలి*


*జంగారెడ్డిగూడెంలో  బీసీ సంఘాల ప్రతినిధులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


*30లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది?*


*కొయ్యలగూడెంలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు*


జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి) : బీసీలకు జగన్ మాయమాటలు చెప్పి అణగదొక్కేశాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఆరోపించారు. గురువారం  జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సభలో చంద్రబాబు పాల్గొని సీఎం పై ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మీకు మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఆదరణ పథకం మీ కోసం అప్పుడు అమలు చేశాను. 34, 400 కోట్లు బీసీల కోసం సబ్ ప్లాన్ అమలు చేశాం. 50 శాతం జనాభా ఉన్న బీసీల కోసం జగన్ ఒక్క రూపాయి కూడా అందరి కన్నా ఎక్కువ ఖర్చు చేశాడా? 140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలి. టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే బీసీలకు ముష్టి మూడు పదవులు ఇచ్చాడు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ టీడీపీ. సీఎం, డీజీపీ, సీఎస్, సకల శాఖామంత్రి, సాక్షి గుమస్తా అంతా ఆయన జిల్లాకు చెందినవారే. సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల వీరేనా రాజకీయం చేసేది..? మీరు చేయలేరా? యూనివర్శిటీల్లో వీసీలనే కాదు, రిజిస్ట్రార్లను మీ వారినే వేసుకున్నారు. ఇతర కులాల వీసీలను తొలగించి మీకు నచ్చిన వారిని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి పేరు మార్చారు. జగన్ మీటింగ్‌కు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీటింగులకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను లాగేసారు. పెళ్లి కానుక లేదు, అన్న క్యాంటీన్ లేదు..అన్ని పోయాయి. ఆయనకు బటన్ నొక్కడం మాత్రమే వచ్చు. మీ పొట్టలు కొట్టి, జగన్ తన పొట్ట పెంచుకుంటున్నాడంటూ చంద్రబాబు మండిపడ్డారు.


పేరుకే వైసీపీలో బీసీలకు పదవులు.. పెత్తనమంతా అగ్రకులాలదే : జగన్‌ పేరుకే వైసీపీలో బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ‘బీసీలకు ఇదేం ఖర్మ’ అని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీల పొట్టగొట్టి, జగన్‌ రెడ్డి తన పొట్ట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ పేరుకే వైసీపీలో బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు. మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. విద్వేషంతో బీసీలందర్నీ జగన్‌ అణగదొక్కుతున్నారని దుయ్యబట్టారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప బీసీలకు అదనంగా ఏం చేశారని ప్రశ్నించారు. 140 బీసీ కులాలకు జగన్‌ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా 3 మాత్రమే బీసీలకు ఇచ్చారని విమర్శించారు. జనాభాలో 50శాతం పైగా ఉన్న బీసీలకు వివిధ నామినేటెడ్ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువని తెలిపారు. వీసీలు, సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో చర్చించేందుకు జగన్‌ సిద్ధమా? అని సవాల్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందని, వచ్చే ఎన్నికల్లోనూ అది పునరావృతం కానుందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


30లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది? : అనంతరం కొయ్యలగూడెంలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ ఎక్కడ సభ పెట్టినా వచ్చే దారిలో గోడలు కడుతున్నారు. ఆయన వస్తున్నారంటే చాలు ఆ ప్రాంతానికి రెండ్రోజులు సెలవు ఇస్తారు. జగన్‌ సభకు డ్వాక్రా మహిళలు తప్పక రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నల్ల దుస్తులు వేసుకుంటే చాలు. జగన్ సభకు రాకూడదంటారు. కానీ, మా రోడ్‌షోలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. టీడీపీ  హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదు. 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది? మద్యపాన నిషేధం విధిస్తానని కమ్మని కబుర్లు చెప్పారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఖనిజాలు దోపిడీ చేస్తున్నారు. పేదలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Comments