అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు

 

విజయవాడ (ప్రజా అమరావతి);

అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు


: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు

అందరినీ సమానత్వంగా చూద్దాం.. 

‘అసమానతలను అంతం చేయడానికి ఏకమవుదాం’ ప్రచారానికి తొలి సంతకం చేసిన మల్లాది విష్ణు.. 

అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చునని, 2030 సంవత్సరం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ -  వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం, నివారణలో పాలు పంచుకుంటానని  అందరిచేత మల్లాది విష్ణు ప్రమాణం చేయించారు. ఈ ఏడాది థీమ్ అయిన సమానత్వం : “అసమానతలను అంతం చేయడానికి ఏకమవుదాం’’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆయన తొలి సంతకం చేసి ప్రారంభించారు.    

  ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ... ఎయిడ్స్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశాన్ని 2030వ సంవత్సరం కల్లా ఎయిడ్స్ రహిత దేశంగా ప్రణాళికలు రచిస్తే.. 2030వ సంవత్సరం కంటే ముందుగానే రాష్ట్రాన్ని ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం, మందులతో పాటు రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న అమ్మఒడి, ఇళ్ల స్థలాలు వంటి కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వామ్యం చేశామన్నారు. ఎయిడ్స్ నివారణకు భారతదేశంలో మొదటిగా అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది థీమ్ సమానత్వానికి ఇది తార్కాణమన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాడడం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినం  జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988లో ఎయిడ్స్ దినం  నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన, నియంత్రణ కోసం రూపొందించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు వ్యాధిగ్రస్తులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్ లను మల్లాది విష్ణు అందజేశారు. 

ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.యస్. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మన దేశంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా నిలిచిందన్నారు. విభజనాంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 2015లో రాష్ట్రంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణకు చేసిన కృషితో ఎయిడ్స్ బారిన పడిన వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు.  హెచ్ఐవీ పట్ల వివక్షను తొలగించి, యువతీ యువకుల్లో అవగాహన కల్పించడం కోసం ‘సేఫ్ లైఫ్’ (సురక్షితమైన జీవితం) ప్రచార కార్యక్రమాన్ని అన్ని విద్యాసంస్థల్లో ప్రారంభించామన్నారు. గుంటూరు జిల్లాలోని కె.ఎల్. యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మిగతా అన్ని యూనివర్సిటీలలో కూడా నిర్వహిస్తామన్నారు. ఎయిడ్స్ నివారణ, వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడానికి ఆహార జాగ్రత్తలు, ఫిజికల్ ఫిట్ నెస్, యోగా, నాన్ కమ్యూనల్ వ్యాధులపై అవగాహన వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఏపీ నియంత్రణ సంస్థ విశేషంగా కృషిచేస్తుందని ఆయన తెలిపారు.

డాక్టర్ సమరం మాట్లాడుతూ... జన చైతన్యం, జన అవగాహనే ఎయిడ్స్ నిర్మూనలకు మార్గమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లోను అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందలు తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొవాలన్నారు. మన దేశం 2030 సంవత్సరం నాటికి ‘ఎయిడ్స్ రహిత దేశం’గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

గిరిజన పాఠశాల చిన్నారుల ‘బైంసా నృత్యం’, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ వీధి నాటకం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ (PEPFAR) ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఐసీఈ & DTS జేడీ డాక్టర్ కిషోర్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ విఠల్ రావు, లెప్రసీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ యాస్ మిన్, చెస్ ప్లస్ రేణుక, ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని, డాక్లర్ జూపూడి ఉషారాణి, జిల్లా గిరిజన సంస్థ అధికారి రుఖ్మండయ్య, జీవనరేఖ మహిళా సంఘం మున్నీషా, పీడీ అర్చన, కృష్ణా యువజన సంక్షేమ సంఘం కిరణ్, వాలంటరీ హెల్త్ సర్వీసెస్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ భారీ ఎత్తున ర్యాలీ.. 

కార్యక్రమానికి ముందుగా.. విజయవాడలోని ఏలూరు లాకులు శోభన్ బాబు విగ్రహం దగ్గర నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ‘ప్రపంచ ఎయిద్స్ దినం ర్యాలీ’ని ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.యస్. నవీన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.  ఏలూరు లాకుల వద్ద ప్రారంభమైన ర్యాలీ హనుమాన్ పేట, పాత గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఈ ర్యాలీ చేరింది.  ఈ ర్యాలీలో నేషనల్ క్యాడెడ్ కార్ప్స్ (NCC) జూనియర్ వారెంట్ ఆఫీసర్ అజిత్ సింగ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, యువత భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమానికి హాజరయ్యారు.


Comments