టీడీపీని ముంచుతూ వచ్చిన కొత్త అభ్యర్థులు

 *- రావి అంటే 2004 అనుకొంటిరా.. 2024* 

 *- టీడీపీని ముంచుతూ వచ్చిన కొత్త అభ్యర్థులు*


 

 *- తగ్గేదేలే అంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు* 

 *- రావి కుటుంబానికి పెరుగుతూ వస్తున్న మద్దతు* 

 *- టీడీపీలో తిరుగులేని శక్తిగా మాజీ ఎమ్మెల్యే రావి* 

 *- రావిని ఎదుర్కోవడం ఇక కష్టమేనంటున్న విశ్లేషకులు*గుడివాడ, డిసెంబర్ 21 (ప్రజా అమరావతి): మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అంటే 2004లో... అనుకుంటే తప్పులో కాలేసినట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 నాటికి గుడివాడ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చే పనిలో రావి నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ రాజకీయాలను ఇప్పటి వరకు విశ్లేషిస్తే ఆ పార్టీని కొత్తగా వచ్చిన అభ్యర్థులే ముంచుతూ వచ్చినట్టుగా అర్థమవుతుంది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మూడుసార్లు టీడీపీ సీటు ఇవ్వకపోయినా ఆ పార్టీ విజయానికి శ్రమించిన మాజీ ఎమ్మెల్యే రావి నాయకత్వంలో ఇప్పుడు తగ్గేదేలే అంటూ పార్టీ పూర్వ వైభవానికి శ్రేణులంతా కలిసి పనిచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గుడివాడ రాజకీయాలపై రావి కుటుంబం ముద్ర స్పష్టంగా కన్పిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత రావి కుటుంబం నుండి ముగ్గురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత రావి శోభనాద్రి చౌదరి గుడివాడ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఆయన కుమారుడు హరిగోపాల్ ఎమ్మెల్యేగా గెల్చిన తర్వాత ప్రమాణస్వీకారం చేయకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత వచ్చిన రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా 2004 వరకు కొనసాగారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం రావికి సీటును కేటాయించక పోవడంతో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటి వరకు రావి నాయకత్వంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీలో చీలిక ప్రమాదం ఏర్పడింది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని రావిపై వత్తిడి పెరిగినప్పటికీ వెనక్కి తగ్గడంతో అప్పట్లో కొడాలి నాని ఎన్నిక సులువైంది. 2014 ఎన్నికల నాటికి మళ్ళీ గుడివాడలో టీడీపీ రాజకీయాలు మారిపోయాయి. ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పదేళ్ళ తర్వాత తిరిగి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీటును దేవినేని అవినాష్ కు కేటాయించినప్పటికీ ఆ పార్టీకి విజయం దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాత్రం పెద్ద మనస్సుతో టీడీపీలోనే కొనసాగారు. ఎన్నికల తర్వాత అవినాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కష్టకాలంలో తిరిగి రావి గుడివాడ టిడిపి ఇన్ ఛార్జి బాధ్యతలను చేపట్టారు. గత మూడున్నరేళ్ళుగా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు రావి కుటుంబానికి కూడా మద్దతు పెరుగుతూ వస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అండగా నిలవడమే కారణంగా చెబుతున్నారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీలో రావి తిరుగులేని శక్తిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో గుడివాడలో రావిని ఎదుర్కోవడం ఇక కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రావి నాయకత్వంలో గుడివాడలో "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారి మద్దతును కూడగడుతున్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు కూడా రావిని స్వాగతిస్తున్నారు. రావి కూడా ముస్లిం మైనార్టీలను కలిసినపుడు హిందీలో, విద్యార్థులను కలిసినపుడు ఇంగ్లీష్ లో, స్థానికులతో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఇచ్చిన పిలుపుమేరకు "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావి తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Comments