ఒకే విడతలో పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తోంది
నెల్లూరు డిసెంబరు 23 (ప్రజా అమరావతి):


జిల్లాలోని 32,231 ఎకరాల చుక్కల భూముల సమస్యను ఒకే విడతలో పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తోంద


ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, వెంకటగిరి, కందుకూరు, నెల్లూరు గ్రామీణ, ఉదయగిరి శాసనసభ్యులు  శ్రీయుతులు ఆనం రామనారాయణరెడ్డి, శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డి, శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి మంత్రివర్యులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో చుక్కల భూములు, వ్యవసాయము-  పంట నష్టపరిహారం, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు,  విద్య వైద్యం ఆరోగ్యం, జల జీవన్ మిషన్, రహదారులు భవనాలు, జల వనరులు, తదితర అంశాలపై మంత్రివర్యులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. 


అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జిల్లాలో ప్రధానంగా ఉన్న చుక్కల భూముల సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పరిష్కారానికి నోచుకుంటుందన్నారు. గతంలో దాదాపుగా జిల్లాలో అనేక నిబంధనలు ఉన్నాయని ఒక్కో రైతు దరఖాస్తు చేసుకోవడం వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో  విచారించి అధికారులు ఆదేశాలు జారీ చేసేవారన్నారు.


నేడు అలాంటి పరిస్థితి లేకుండా జిల్లాలో 32,231 ఎకరాలు చుక్కల భూములకు ఒకే విడతలో ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా 40వేల  మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా వారికి సంబంధించి 22 578 సర్వే నంబర్లలో నిషేధిత భూముల జాబితా నుండి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి  త్వరలో ఆదేశాలు వస్తున్నాయన్నారు.దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతాంగానికి ఇది ఒక గొప్ప  వరమన్నారు.


ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులను  ఆదుకునేందుకు  80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందుబాటులోకి తెచ్చి పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.


అలాగే ఎక్కడ పంట నష్టం వాటిల్లిందో వాటి అంచనాలు తయారు చేయించి ఈ సీజన్ ముగిసే లోపే సంబంధిత రైతుల ఖాతాలకు నష్టపరిహారం జమ చేయడం జరుగుతుందన్నారు.


రైతు భరోసా కేంద్రాలలో  అవసరమైన ఎరువుల నిల్వలు కావలసినంత అందుబాటులో ఉంచామని, సొసైటీలలో కూడా బఫర్ స్టాకు ఉంచామన్నారు. 


ఎక్కడైనా డీలర్లు మార్కెట్లో ఒక్క రూపాయి అదనంగా విక్రయించిన వెంటనే ఆ దుకాణాలను సీజ్ చేయాలని అధికారులకు సూచించామన్నారు.


కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 రాబోతున్న నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పాట్లు సమీక్షించామన్నారు.


ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి జిల్లా అధికార యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉందన్నారు.


జిల్లాలో జలజీవన్ మిషన్ కు సంబంధించి 7వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలో టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించి ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు.


జిల్లావ్యాప్తంగా 8 వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం మరో మూడు నాలుగు రోజులు పాటు కొనసాగుతుందని చెప్పారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న వయసులోనే పిల్లలకు అందించాలని లక్ష్యంతో టాబుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు.


రాబోయే రోజుల్లో గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలని సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.


ఎన్నడూ లేనివిధంగా జిల్లా అధికంగా విస్తరిస్తుందన్నారు. నుడా పరిధిలోకి అన్ని మండలాలను తీసుకురావడం జరిగిందన్నారు.


అన్ని పట్టణాల్లో అర్బన్ ఇల్లు మంజూరు చేశామన్నారు. అందులో 50 శాతం  నిర్మాణాలు పూర్తయ్యాయని చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయని శాసనసభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారన్నారు.


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు ఇంటింటికి తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగిందన్నారు.


జిల్లాస్థాయిలో కలెక్టర్ పరిధిలో పూర్తి చేయగలిగినవి వెంటనే పూర్తి చేస్తామని అలాగే రాష్ట్రస్థాయిలో చేయాల్సినవి  ప్రభుత్వదృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


 నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో మునుపెన్నడూ లేని విధంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టి వైద్య సిబ్బందిని కావాల్సినంత మేరకు నియామకం చేయడం జరిగిందన్నారు.  పూర్తి స్థాయిలో డాక్టర్లు వచ్చి పని చేస్తున్నారన్నారు. ప్రతి చోట పదవీ విరమణ పొందిన డాక్టర్లు కూడా ముందుకు వస్తూ ఉండడంతో వారిని కూడా మరల నియమించామన్నారు. సాంకేతిక సిబ్బంది నియామకం కోసం కూడా  ఇప్పటికే పిలిచామని త్వరలో భర్తీ చేస్తామన్నారు.

 వైద్య సిబ్బంది కొరత

ఇప్పటిది కాదని చాలా కాలం నుంచి ఉందని అయినప్పటికీ సిబ్బందితోపాటు పరికరాలను సమకూర్చుకోవడం అంచలంచెలుగా సమస్యలను అధిగమించడం జరుగుతుందన్నారు. 


అంతకు ముందు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరిస్తూ జిల్లాలో పంట నష్టం అంచనాలు ఇప్పటికే పూర్తయ్యాయని, నుడా పరిధిలోని లేఅవుట్లలో తోరణాల నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నాడు నేడు కింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు వచ్చే ఫిబ్రవరి మాసాంతానికి పూర్తవుతాయన్నారు. జిల్లాలో ఎనిమిదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. కొత్తగా వచ్చిన కోవిడ్ వేరియంట్ బిఎఫ్ 7 ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారన్నారు..


వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గూడూరు- రాజంపేట రహదారి మార్గంలో ఇటీవల వర్షాలకు బాగా గుంతలు ఏర్పడ్డాయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.


 కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుకు సజావుగా నీరు చేరే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

జలజీవన్ మిషన్ కింద తన నియోజకవర్గంలో తక్కువ పనులు మంజూరు చేశారని వాటిని మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ జగనన్న లేఔట్ లో విద్యుత్తు మంచినీరు వంటి కనీస సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వాస్తవంగా పంట నష్టం ఎంత జరిగిందో ఆ మేరకు తప్పకుండా అంచనాలు సిద్ధం చేసేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు దాతలు ఇచ్చిన స్థలాలు అన్ని పరిగణలోనికి తీసుకొని ప్రహరీలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని రికార్డులను ఒకసారి పరిశీలించాలన్నారు.


నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాను లేవనెత్తే ప్రజా సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రశ్నిస్తున్నానన్నారు. నియోజకవర్గంలో వరద దెబ్బతిన్న ప్రాంతాల మరమ్మతు పనులు జలవనుల శాఖ అధికారులు చేపట్టడం లేదన్నారు. సౌత్మోపూరులో ఇటీవల వర్షాలకు ఎస్సీ ఎస్టీ రైతులకు చెందిన 150 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. అంతేకాకుండా డీకే డబ్ల్యూ  కళాశాల -డైకస్ రహదారి,  గొల్లకుదురు -సజ్జాపురం రహదారి, కోడూరుపాడు, నారాయణరెడ్డిపాడు ములుమూడి -తాటిపర్తి రహదారి మార్గాలు, పోట్టేపాడు కలుజు వంతెన నిర్మాణం వంటి పనులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  వావిలేటిపాడు అక్కచెరువుపాడు వైయస్ ఆర్ జగనన్న కాలనీలో  మౌలిక సదుపాయాలు లేక సరైన పురోగతి లేదన్నారు. బారాషాహిద్ దర్గాకు 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేసిన నిధులు ఇంకా విడుదల కాలేదన్నారు.


ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు,పసుపు పంటలు దాదాపు రెండు వందల ఎకరాల్లో వేశారని పంట నష్టం అంచనాలు సజావుగా చేపట్టాలని కోరారు.


అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పంట సాగుదారు హక్కు పత్రం పై అవగాహన గోడపత్రాన్ని మంత్రివర్యులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శ్రీ రోనంకి కూర్మానాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి డి హరిత, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ,డిఆర్డిఏ డ్వామా,  మెప్మా, హౌసింగ్ పిడీలు శ్రీ సాంబశివరెడ్డి, శ్రీ వెంకటరావు, శ్రీ రవీంద్ర, శ్రీ నాగరాజు జెడ్పి సీఈవో సి చిరంజీవి, డిటిసి శ్రీ చందర్, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీ మురళీకృష్ణ ,జల వనరుల శాఖ ఎస్.ఈ  శ్రీ కృష్ణమోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ శ్రీ రంగ వరప్రసాద్, తెలుగు గంగ ప్రాజెక్టు సి ఈ శ్రీ హరి నారాయణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments