అమాంతం పెరిగిన మాజీ ఎమ్మెల్యే రావి గ్రాఫ్

 *- అమాంతం పెరిగిన మాజీ ఎమ్మెల్యే రావి గ్రాఫ్* 


 *- చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా గుడివాడ సీటు* 

 *- కొడాలి నానిని "రావి ఢీ కొట్టగలడనే నమ్మకం* 

 *- "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" తో రావి దూకుడు* 

 *- 2024లో గెలుస్తామనే నిర్ణయానికొచ్చిన చంద్రబాబు* 


గుడివాడ, డిసెంబర్ 31(ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గ్రాఫ్ అమాంతం పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎన్టీఆర్ నియోజకవర్గంగా ఉన్న గుడివాడ సీటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. చంద్రబాబు ఎప్పటి నుండో గుడివాడ సీటును కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రావిని ఎప్పటికపుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు రావి ఇమేజ్ ని మరింత పెంచాయనే చెబుతున్నారు. ఈ వేడుకలకు ముందు రోజు వైసీపీ నేతల దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని రావి తన బలాన్ని నిరూపించుకున్నారు. దీంతో గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానిని రావి ఖచ్చితంగా ఢీ కొట్టగలడన్న నమ్మకం చంద్రబాబుకు కలిగిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి కూడా "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం ద్వారా తనదైన శైలిలో దూకుడు పెంచారు. మరోవైపు చంద్రబాబు కూడా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వస్తున్నారు. దీనిలో భాగంగానే బలమైన కుటుంబం నుండి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రావికి గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పగ్గాలు అప్పగించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో సమావేశమయ్యే ప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేకంగా రావితో మాట్లాడుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు ఆదేశాలతో గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన "బాదుడే బాదుడు" కార్యక్రమానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఆ తర్వాత "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని రావిని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో రావి టీడీపీ శ్రేణులతో కలిసి రోజుకు ఐదారు గంటలకు పైగా నియోజకవర్గ ప్రజల మధ్యలోనే గడుపుతున్నారు. అన్నివర్గాల ప్రజలను కలుస్తూ ప్రభుత్వ వ్యతిరేక పాలనను ఎండగడుతున్నారు. వ్యాపార వర్గాలను కూడా వదలకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఏ వర్గాలు నష్టపోతున్నారో అవగాహన కల్పిస్తున్నారు. అసలు విషయం చెప్పాలంటే "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని వినియోగించుకోవడం ద్వారా చంద్రబాబును రావి మెప్పించగలిగారని అంటున్నారు. ఇంకోవైపు గుడివాడ నియోజకవర్గంలోని అన్నివర్గాల నుండి రావికి మద్దతు పెరుగుతూ వస్తోంది. చంద్రబాబు అప్పగించిన టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్న నమ్మకం అధిష్టానంలో ఏర్పడింది. ఈ పరిణామాలతో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైందని పార్టీ సీనియర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గుడివాడ సీటును ఖచ్చితంగా గెల్చుకుంటామనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన రావిలో ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలన్న కసి మాత్రం స్పష్టంగా కన్పిస్తోంది.

Comments