మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి.

 


*మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి


*


పార్వతీపురం, డిసెంబరు 28 (ప్రజా అమరావతి): జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి సమీపంలోని 5.20 ఎకరాల వైశాల్యంలో రెగ్యులర్ నిధులు అంచనా విలువ సుమారు రూ.49.26 కోట్లతో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు.   ఆసుపత్రి నిర్మాణ భవనాలను, వసతుల వివరాలను ఏ పి ఎమ్ ఎస్ ఐ డి సి అధికారులు మ్యాప్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్న దృడ సంకల్పంతో ఉన్నందున సూపర్ స్పెషాలిటీ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. నిధులు కేటాయించినందున 50 పడకల నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని నిశితంగా పరిశీలించారు. వసతులను అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రి భవన మరమ్మత్తులకు, ఆధునీకరణ పనులు ప్రతిపాదనలు పంపించామని ఎమ్ డి దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లగా అనుమతులు మంజూరు చేస్తామని ప్రతిపాదిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు చీటీలు పంపించి వైద్యం చేయించే విధానం ఉండరాదని ఆసుపత్రి సూపరిండెంట్ డా, వాగ్దేవికి సూచించారు.


*మెడికల్ కళాశాలకు స్థల పరిశీలన*


గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలోని వై ఎస్ ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం దగ్గర మెడికల్ కళాశాల నిర్మాణానికి  ఏపిఎంఎస్ ఐడి ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంయుక్తంగా స్థల పరిశీలన చేశారు. ఉద్యాన వన విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థలం, మెడికల్  కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మ్యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. మెడికల్ కళాశాలకు ప్రతిపాదించిన స్థలం చాలా అనుకూలంగా, ప్రశాంత వాతావరణంలో ఉందని, అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి సిద్ధం చేయాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, ఆర్డిఓ కె.హేమలత, ఏపీ ఎంఎస్ ఐడీసీ సూపరిండెంట్ ఇంజనీర్ శివకుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసన్న కుమార్, తాసిల్దార్ రఫీ జాన్, రెవెన్యూ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Comments