పులివెందుల పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


పులివెందుల, వైయస్సార్‌ జిల్లా (ప్రజా అమరావతి);


*పులివెందుల పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*




 

*పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ అభివృద్ది పనులను ప్రారంభించే క్రమంలో బాధితులను చూసి కాన్వాయ్‌ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం*


*అనంతగిరి*


రాజంపేట కొలిమివీధికి చెందిన దేవర రఘురాములు తన కుమారుడి అనారోగ్య సమస్యను సీఎంని కలిసి వివరించారు. తన చిన్న కుమారుడు అనంతగిరి (23 సంవత్సరాలు) నరాల బలహీనత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని, తను కూల్‌డ్రింక్స్‌ దుకాణం నడుపుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్నట్లు, తన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంని కోరారు. రఘురాములు కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.


*జశ్వంత్‌*


కర్నూలు జిల్లా ఆదోని తాలుకా తంగరడూన్‌ గ్రామానికి చెందిన రంగన్న, లక్ష్మిలు తమ కుమారుడు జశ్వంత్‌కు పుట్టిన సమయంలో ఫిట్స్‌ వచ్చాయని, అప్పటినుంచి మాటలు రాలేదని, మైరుగైన వైద్యం కోసం ఆర్ధిక స్ధోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

 

*మహేంద్ర*


కర్నూలు జిల్లా ఆదోని తాలుకా పెద్ద ఒత్తూరు గ్రామానికి చెందిన నాగరాజు, పుష్పావతిలు తమ కుమారుడు మహేంద్రకు మాటలు రావని, నడవలేని స్ధితిలో ఉన్నాడని, అప్పులు చేయించి వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదని తమ ఇబ్బందిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పులివెందులలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, వైద్యం చేయించుకునే స్ధోమత లేదని విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ అనారోగ్యానికి గురైన బాలురకు వెంటనే మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజును ఆదేశించారు. 


*వెంకట మల్లేష్‌*


పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట మల్లేష్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఇప్పటివరకు నాలుగు లక్షలుపైగా ఖర్చు అయిందని సీఎంకి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం ఇకపై పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా కల్పించారు. 


*షేక్‌ ఖదీర్‌*


షేక్‌ ఖదీర్‌ రాయచోటి ప్రాంతం తన సొంత ఊరని, ప్రస్తుతం పులివెందుల మండలంలో నివాసం ఉంటూ, డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నానన్నారు. అయితే ఇటీవల జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌లో తన కుడికాలు తీసేశారని, జీవనోపాధి కోల్పోయానని, సొంత ఇల్లు కూడా లేదని సీఎంకి విన్నవించారు. స్పందించిన సీఎం తప్పకుండా ఆర్ధిక భరోసా కల్పించేలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.


*అంకాలమ్మ*


సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన అంకాలమ్మ తన భర్త వదిలేశాడని, తనకు ఇద్దరు పిల్లల్లో చిన్నబాబుకు తొమ్మిది నెలల వయస్సు అని, అయితే ఆ బాబుకు గుండెలో రంధ్రం ఉండడంతో అనేక చోట్ల అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగానని, తన కుమారుడిని ఎలాగైనా బతికించమని సీఎంని వేడుకున్నారు. స్పందించిన సీఎం ఆ బాబుకు అవసరమైన మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి ఆదుకుంటుందని భరోసానిచ్చారు. 


*లావణ్య*


పులివెందుల 7 వ వార్డుకు చెందిన ఆంజనేయులు తన కుమార్తె లావణ్య (13) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. లావణ్య చికిత్సకు ఎంత ఖర్చయినా సరే ప్రభుత్వమే భరించి పూర్తిగా నయం చేసేలా చర్యలు తీసుకుంటుందని సీఎం ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. 


సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.

Comments