ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం

 

నెల్లూరు, డిసెంబర్ 2 (ప్రజా అమరావతి): ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం


గా  పనిచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 

శుక్రవారం ఉదయం ముత్తుకూరు మండలం గోవిందరెడ్డిపాలెం గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. 


 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గోవిందరెడ్డి పాలెం గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు అనేకసార్లు విజ్ఞప్తి చేశారని, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కరోనా పరిస్థితుల వల్ల ఆలయ నిర్మాణం జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టిటిడి సహకారంతో పూర్తి చేసేందుకు పనులు మొదలు పెట్టడం శుభపరిణామమని, దీంతో గ్రామస్తుల కల నెరవేరుతున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే మొదలైన ఆలయాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఆలయాన్ని కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ముత్తుకూరు మండలంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని ప్రజలందరికీ అందించామని, ఇంకా 1200 కుటుంబాలకు సాంకేతిక కారణాలతో నగదు జమ కాలేదని, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి వారికి కూడా నగదు జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారాలు అందిస్తూ, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

 ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, ఎంపీపీ గండవరపు సుగుణమ్మ, సర్పంచ్ యెంబేటి సుధాకర్, తాసిల్దార్ మనోహర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు విష్ణువర్ధన్ రెడ్డి, చిన్నపరెడ్డి, సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు రాంబాబు, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments