ఉన్నత లక్ష్యాలే ధ్యేయం



*ఉన్నత లక్ష్యాలే ధ్యేయం


*


 పార్వతిపురం/ సాలూరు, డిసెంబర్ 21 (ప్రజా అమరావతి): విద్యార్థులు ఉన్నత శిఖరాలు సాధించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరాలని అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. బైజుస్ సంస్థతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు మంచి పాఠ్యాంశాలను డిజిటల్ విధానంలో బోధించుటకు ప్రభుత్వం ఒప్పందం చేస్తుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని అందుకు పేదరికం అడ్డు రాకూడదని లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తుందని, మధ్యాహ్నం భోజనం, విద్యా కానుక కిట్లు అందించి వారి బాగోగులకు ముందడుగు వేస్తుందన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు కింద ఫీజు రీయింబర్స్మెంట్, వసతి గృహాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత సంకల్పానికి విద్యార్థులు అందరూ చేతులు కలపాలని, కృషితో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరాలని పిలుపునిచ్చారు. కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దరంలో విద్య ఆవశ్యకత కలిగి ఉందని విద్యార్థులు దీన్ని గ్రహించి ప్రభుత్వం అందిస్తున్న చేదోడును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని తద్వారా విద్యార్థులకు మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థులకు డిజిటల్ తరగతుల నిర్వహణ కొరకు ట్యాబ్ లను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. బై జూస్ సంస్థ శాస్త్రీయ దృక్పథంతో పాఠ్యాంశాలు అందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ జరుగుతుందని ఇందుకుగాను ప్రభుత్వం 35 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు. విద్యార్థులు టాబ్ లను సక్రమంగా ఉపయోగించుకొని విద్యలో అభ్యున్నతి సాధించాలని అన్నారు. జిల్లాలో 9952 మంది 8వ తరగతి విద్యార్థులు ఉన్నారని, 1021 మంది ఉపాధ్యాయులకు మొత్తం10973 టాబ్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టాబ్ తో పాటు అందులో పెట్టిన సాప్ట్ వేర్ వెరసి ఒక్కో టాబ్ 32 వేల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. 


టాబ్ లు అందుకున్న విద్యార్థులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి టాబ్ లను అందించడం ఆనందంగా ఉందన్నారు. డిజిటల్ విధానంలో చదవగలమా అనే సంకోచానికి ముఖ్య మంత్రి ఫుల్ స్టాప్ పెట్టారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కొనే పరిస్థితి లేదని, టాబ్ ల కోరికను సైతం ముఖ్య మంత్రి తీర్చారని పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి దా.ఎస్.డి.వి.రమణ, స్థానిక అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Comments