అమడగూరు మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటన

 *అమడగూరు మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటన**: కస్సముద్రం, అమడగూరు, గుండువారిపల్లి, తుమ్మల గ్రామ సచివాలయాల ఆకస్మిక తనిఖీ*


అమడగూరు (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 20 (ప్రజా అమరావతి):


జిల్లాలోని అమడగూరు మండలంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ విస్తృతంగా పర్యరించారు. మంగళవారం అమడగూరు మండలంలోని కస్సముద్రం, అమడగూరు, గుండువారిపల్లి, తుమ్మల గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చూడాలన్నారు. ఆయా సచివాలయాలకు వస్తున్న సర్వీసులను మరిన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయని, ఈశ్రమ్స్ పెంచాలన్నారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు పూర్తిగా చేయాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా సచివాలయాల్లో రిజిస్టర్లను తనిఖీ చేయడం జరిగింది.


తుమ్మల గ్రామ సచివాలయంలో ఈనెల 24వతేదీన డెలివరీ డేట్ ఇచ్చిన హైరిస్క్ గర్భిణీ అరుణతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం మొలకవారిపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ప్రసవం కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిల కంటే ప్రభుత్వాసుపత్రిలోనే సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని, ప్రైవేట్ ఆసుపతులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు. హైరిస్క్ గర్భిణీలను 2, 3 రోజుల ముందుగానే ఏరియా ఆసుపత్రులకుగానీ, జిజిహెచ్ కి గానీ రిఫర్ చేసి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ ప్రసవం జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ నసీమా, మెడికల్ ఆఫీసర్ డా.అపర్ణ, సిహెచ్ఓ ఫక్రుద్దీన్, ఎంపీ హెచ్ఎస్ ఫిమేల్ సూపర్వైజర్ మేరీ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ రెడ్డెమ్మ, ఏఎంఎం అనిత కుమారి, ఆశాలు శంకరేశ్వరి, మహిత, గంగులమ్మ, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.Comments