ట్విటర్ బాస్‌గా ఉండాలా? వైదొలగాలా?.. పోల్ పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్
వాషింగ్టన్ (ప్రజా అమరావతి): ట్విటర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ (Elon Musk) దాంట్లో అనేక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఆందోళన చెందుతున్న ప్రకటనదారులు ట్విటర్ (Twitter)తో సంబంధాలను తెంచేసుకుంటున్నారు. మరోవైపు ఆయన దృష్టి మొత్తం ట్విటర్ (Twitter)పైనే ఉందంటూ టెస్లా వాటాదారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెస్లా షేరు విలువ గత కొన్ని నెలల్లో భారీగా పతనమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మస్క్ (Elon Musk) ఓ ఆసక్తికరమైన పోల్‌ను ట్విటర్ (Twitter)లో పోస్ట్ చేశారు. తాను ట్విటర్ అధిపతిగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నించారు. యూజర్ల నిర్ణయానికి కచ్చితంగా కట్టటుబడి ఉంటానని చెప్పారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ.. ఇకపై ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన దానికి క్షమాపణలు కోరారు. ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. అలాగే ‘‘మీరు ఏదైనా కోరుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని మీరు పొందొచ్చు’’ అని చెప్పే ఓ ఆంగ్ల సామెతను కూడా పోస్ట్ చేశారు. పరోక్షంగా తాను ట్విటర్ అధిపతిగా ఉండాలా? లేక వైదొలగాలా అనే విషయంపై ఆచితూచి స్పందించాలని చెప్పకనే చెప్పారు. పోల్‌ను మస్క్ భారత కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున 4:50 గంటలకు పోస్ట్ చేశారు. ఓటు చేయడానికి మరో 4 గంటలు మిగిలి ఉందనగా.. 57 శాతం మంది వైదొలగాలని.. 43 శాతం మంది వద్దు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇతర సామాజిక మాధ్యమాలను ప్రమోట్ చేసే ట్విటర్ (Twitter) ఖాతాలను నిషేధిస్తున్నట్లు ట్విటర్ ఆదివారం ప్రకటించింది. అయితే, ఇతర సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని పంచుకోవడానికి వాటికి సంబంధించిన లింక్స్‌ను మాత్రం పోస్ట్ చేయొచ్చని స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల మస్క్ (Elon Musk) కొంత మంది పాత్రికేయుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా గళాన్ని నొక్కివేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు.
addComments
Post a Comment