*ఫ్యామిలీ డాక్టరు సేవలు అందుతున్నాయా*
పార్వతీపురం/పాలకొండ, డిసెంబరు 2 (ప్రజా అమరావతి): ఫ్యామిలీ డాక్టరు సేవలు అందుతున్నాయా అంటూ ఆరా తీశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పాలకొండ మండలం వెలగవాడ ఉప ఆరోగ్య కేంద్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేశారు. సావిత్రి, లక్ష్మి, పార్వతి అనే మహిళలతో జిల్లా కలెక్టర్ మాట్లాడి సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టరు శిబిరంలో 60 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్కువ మందిలో బి.పి, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టరు విధానాన్ని అమలు చేస్తుందని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక రోగంతో కదలలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దనే వైద్యం అందించుట జరుగుతుందని ఆయన వివరించారు. గ్రామాల్లో అంటు వ్యాధులు, అంటు వ్యాధులు కాని బిపి, మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. సంబంధిత వ్యాధుల పట్ల సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలోనే అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పట్ల గ్రామస్తులు కూడా శ్రద్ద వహించాలని ఆయన సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని - ఆరోగ్యం చక్కగా ఉండుటకు శ్రద్ద వహించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎటువంటి రిస్క్ తీసుకోరాదని, ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డెప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా.పార్వతి, పి.హెచ్.సి వైద్యులు కమల్ నాథ్, 104 వైద్యులు లక్ష్మీ దేవి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment