చంద్రబాబు పర్యటనతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం



 *- చంద్రబాబు పర్యటనతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం* 


 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


గుడివాడ, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో పర్యటించినా జనసందోహమే కన్పిస్తోందన్నారు. గత నెల్లో నిర్వహించిన కర్నూలు జిల్లా పర్యటనలోనూ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. ముఖ్యంగా చంద్రబాబు రోడ్ షోలకు అనూహ్యస్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు సభలకు స్వచ్చంధంగానే ప్రజలు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన చంద్రబాబు కార్యక్రమాలు ఐదారు గంటలు ఆలస్యమైనా ప్రజలు ఎంతో ఓపికగా వేచి చూశారన్నారు. చంద్రబాబు ప్రసంగాలను ఎంతో శ్రద్ధగా వింటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ప్రజలు చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ప్రజల అభ్యున్నతి, రాష్ట్రాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించడం జరుగుతోందన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో తిరిగి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం, దార్శనికత ద్వారానే రాష్ట్రం గట్టెక్కుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుండి కూడా వినిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళాభివృద్ధికి కృషి జరిగిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించలేదన్నారు. ఆక్వా రంగం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయన్నారు. పరిశ్రమలు కూడా రాష్ట్రం నుండి తరలిపోతున్నాయన్నారు. అమరరాజా సంస్థ తెలంగాణాకు తరలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక సంస్థలను ప్రోత్సహించకుండా ఇబ్బందులు పెట్టడం వల్లే పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి జరుగుతుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కూడా గణనీయంగా మెరుగుపర్చడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ తెలిపారు.

Comments