అర్చక సంక్షేమ వెబ్ సైట్ ప్రారంభం

 *అర్చక సంక్షేమ వెబ్ సైట్ ప్రారంభం*•అర్చకసంక్షేమ పథకాల మంజూరుకై ఈవెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకునే అవకాశం*

 *ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*

                                                                                                                                                                                  అమరావతి, డిశంబరు 21 (ప్రజా అమరావతి):  అర్చక సంక్షేమ వెబ్ సైట్ ను (www.aparchakawelfare.org) ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  బుధవారం ప్రారంభించారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లోని ఆయన చాంబరులో ఈ వెబ్ సైట్ ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ అర్చక సంఘాల అభ్యర్థన మేరకు ఈ వెబ్ సైట్ ను రూపొందించడం జరిగిందన్నారు. అర్చకుల సంక్షేమార్థం అమలు చేస్తున్న పలు పథకాలకు  ఈ వెబ్ సైట్  ద్వారా నేరుగా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షలోని ఆలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమార్థం పలు పథకాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. అర్చకుల సంక్షేమానికై “అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి” ద్వారా ఎప్పటి కప్పుడు నూతన పథకాలను రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉపనయనం, విద్యా గ్రాంటుతో పాటు అర్చక, ఉద్యోగుల పిల్లల వివాహం, గృహ నిర్మాణం,  గృహ మరమ్మత్తులు, వైద్య ఖర్చులు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందిన వారికి ఆర్థిక సహాయాన్ని కూడ అందజేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా పదవీ విరమణ గ్రాట్యుటీ, కారుణ్య ధన సహాయం అందజేయడంతో పాటు వేద విద్యను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకూ  ఈ పధకాల మంజూరీకై అర్చకులు సంబంధిత అధికారుల ద్వారా ధరఖాస్తు చేసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ ప్రక్రియ ఎంతో జాప్యంతో కూడుకున్నదవ్వడం వల్ల ధరఖాస్తుదారులకు సకాలంలో  ఆయా పథకాలు అందకపోవడం జరుగుచున్నదన్నారు. ఈ సమస్యను అధిగమించే విధంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగిందని, ఈ వెబ్ సైట్ ద్వారా అర్హులైన అర్చకులు నేరుగా ధరఖాస్తుచేసుకునే అవకాశం ఏర్పడటమే కాకుండా, ఎటు వంటి జాప్యానికి తావులేకుండా అర్హులు అందరికీ వెంటనే పథకాలను మంజూరు చేసే పరిస్థితులు ఈ వెబ్ సైట్ ద్వారా ఏర్పడ్డాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 


రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్ చార్జి ప్రిన్సిఫల్  సెక్రటరీ మరియు కమిషనర్ ఎం.హరి జవహర్ లాల్, అదనపు కమిషనర్లు టి.చంద్రకుమార్, కె. రామచంద్రమోహన్, జాయింట్ కమిషనర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్, అర్చక వెల్పేర్ అసిస్టెంట్ కమిషనర్ వి.వి.ఎస్.కె. ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


   

Comments