*"బడుగులపక్షం నిలవని, జనక్షేమం పట్టని ప్రతిపక్షముండడం రాష్ట్ర ప్రజల ఖర్మ" : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
*డోన్ నియోజకవర్గవ్యాప్తంగా 3,152 మంది చిన్నారులకు ట్యాబ్ లను పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి*
*రూ.2.3 కోట్లతో బేతంచెర్లలో తారురోడ్డు నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా భూమిపూజ*
*బేతంచెర్లలో రూ.2 కోట్లతో నిర్మించనున్న వాల్మీకి భవనానికి భూమిపూజ*
*మొట్టమొదటి 'షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్' ప్యాపిలీ మండలంలో ఏర్పాటు*
బేతంచెర్ల, నంద్యాల, డిసెంబర్, 28 (ప్రజా అమరావతి); రాష్ట్రంలో మొట్టమొదటి 'షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్' ప్యాపిలీ మండలంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సత్వరం పశువుల యోగక్షేమాలు చూడడం, అత్యాధునిక వైద్య సేవలందించే ఈ కేంద్రం వల్ల ఎంతో ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గవ్యాప్తంగా 3,152 మంది విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ట్యాబ్ లను పంపిణీ చేశారు. "బడుగులపక్షం నిలవని, జనక్షేమం పట్టని ప్రతిపక్షముండడం రాష్ట్ర ప్రజల ఖర్మ" అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఇదేం ఖర్మరా, బాదుడే బాదుడు కార్యక్రమాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధి దిశగా క్షేత్రస్థాయిలో అనేక భవన నిర్మాణాలు నిర్మించడం ఖర్మా? అంటూ ప్రశ్నించారు.చిన్నారులకు ఉచితంగా విద్య సహా, సకల సదుపాయాలివ్వడాన్ని బాదుడనడంలో అర్థం లేదన్నారు. రూ.2.3 కోట్లతో బేతంచెర్లలో తారురోడ్డు నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు.కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు పంచి అలాగే ప్రజల్ని ఉండిపోవాలని కాంక్షించే ప్రభుత్వం మాది కాదని బుగ్గన అన్నారు. ట్యాబ్ లు పంపిణీ చేసి నవతరం భవిష్యత్ కు నాంది పలికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వమన్నారు.డోన్ నియోజకవర్గంలో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఐ.టీ.ఐ, ఎమ్ఎస్ఎమ్ఈ ఎక్స్ టెన్షన్ సెంటర్, షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్, బీసీ బాలబాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ పాఠశాల, హాస్టళ్లు, వెటర్నరి పాలిటెక్నిక్, వ్యాయామ కేంద్రాలు, క్రీడాధారిత సౌకర్యాలు,మోడల్ స్కూళ్ళు, గురుకులాలతో అన్ని రంగాలలో సమానంగా అభివృద్ధి సాధిస్తామని మంత్రి వివరించారు. పిల్లలకు వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి ఇస్తే బాదుడే బాదుడనడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి తపనను అర్థం చేసుకుని విద్యలో మరింత రాణించాలని , తల్లిదండ్రులు గర్వపడే లక్ష్యాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
బేతంచెర్లలో రూ.2 కోట్లతో నిర్మించనున్న వాల్మీకి భవన నిర్మాణానికి సంబంధించి కూడా మంత్రి బుగ్గన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాయల కాలంలో వాల్మీకుల చరిత్ర గురించి, వారి ప్రత్యేకమైన పాత్ర గురించి మంత్రి ప్రస్తావించారు.మాట మీద నిలబడడం,పట్టుదలగా ఉండడం వాల్మీకుల ప్రత్యేకతగా మంత్రి తెలిపారు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సైన్యంలో ఎక్కువగా వాల్మీకులు ఉండి వీరోచితంగా పోరాడినట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రస్తుతం వాల్మీకులే ఎక్కువగా తలార్లుగా ఉండడం గమనించవచ్చన్నారు. ఎవరికీ సాధ్యం కాని పనులను కుల వృత్తులుగా కొనసాగిస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులను ఎంతో గౌరవించాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు.ఏదైమైనా జీవితకాలం వలలతో చేపలు పట్టడం, సుత్తితో రాళ్లు కొట్టడం, ఇస్త్రీ పెట్టేతో ఇస్త్రీ చేయడం, కత్తెరతో జుట్టు కత్తిరించే పనుల్లోనే కొనసాగాలనే దురుద్దేశంతో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ చదివేలా, అందరూ ఎదిగేలా స్వేచ్ఛగా లక్ష్యాలను నిర్దేశించుకునే సంక్షేమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఓట్ల కోసమే కులాలను వినియోగించుకున్నారన్నారు. బేతం చెర్ల నుంచి సిమెంట్ నగర్ కు పోవాలంటే 30 నిమిషాలు పట్టే పరిస్థితి నుంచి 10 నిమిషాల్లో గమ్యం చేరేలా అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. వెల్దుర్తి సహా హుస్సేనాపురం, కొట్టాల, బేతం చెర్ల , బుగ్గాని పల్లె ప్రాంతాల్లో రోడ్లు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి బేతం చెర్ల వ్యాప్తంగా శుభ్రమైన తాగునీరును మొదటి దశలో సరఫరా చేస్తామన్నారు. మంచినీటిని కొనే పరిస్థితే లేకుండా చేస్తామన్నారు.రూ.40 కోట్లతో మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. డోన్ లో అద్భుతంగా 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ సీహెచ్. చలంరెడ్డి, మద్దిలేటి స్వామి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రామచంద్రుడు, అధికారులు, డోన్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment