మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించాం: సీఎం కేసీఆర్‌


 మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించాం: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌ (ప్రజా అమరావతి): జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్‌ సందర్భంగా అంకితమవుదామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, క్రైస్తవ మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


సంతోషకర జీవితాన్ని గడపాలి..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘క్రీస్తు బోధనలు తప్పకుండా ఆచరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం ఉండవు. ప్రపంచంలో యుద్ధాలే జరగవు. నేరస్థుల కోసం జైళ్లే అవసరముండదు. యేసు క్రీస్తు కలలుగన్న ప్రపంచం.. ఎంతో ఉదాత్తమైన మానవ ప్రపంచం. తనను తాను ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయం. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారు. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలి.


అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం అంకితమవుదాం..

‘‘20 ఏళ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో, దిక్కుతోచని స్థితిలో భయంకరమైన వివక్షకు గురవుతూ చిన్నబుచ్చుకున్న తెలంగాణ సమాజాన్ని చూసి ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ నినాదంతో యుద్ధాన్ని ప్రారంభించాం. చివరికి విజయం సాధించాం. విజయ పరంపరలో భాగంగా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తున్నాం. ఏడేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేది. ఇవాళ.. రూ.2.75లక్షలు. ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వామ్యం కావాలి. తెలంగాణ సాధించిన పురోగతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాల్లో కూడా రావాలి. అందుకోసం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించాం. తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి.. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అందుకు మీ అందరి సహకారం కోరుతున్నా. జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగామో.. జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్‌ సందర్భంలో అంకితమవుదాం’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Comments