రాష్ట్రానికి వన్నె తెచ్చే ప్రాజెక్టుల్లో రామాయపట్నం పోర్టు ముందువరుసలో ఉంటుంది


నెల్లూరు, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): రాష్ట్రానికి వన్నె తెచ్చే ప్రాజెక్టుల్లో రామాయపట్నం పోర్టు ముందువరుసలో ఉంటుంద


ని, పోర్టు ఏర్పాటుకు భూములిచ్చిన కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉండి మెరుగైన పునరావాస వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


శనివారం ఉదయం గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు భూ నిర్వాసిత  కుటుంబాలకు పునరావాస సహాయ కార్యక్రమాల్లో భాగంగా రామాయపట్నం సమీపంలో ఏర్పాటు చేసిన  ఆర్ అండ్ ఆర్ కాలనీకి కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభికతో కలిసి  జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు శంకుస్థాపన చేశారు.


 ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో వ్యవసాయ, మైనింగ్ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉండి, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయన్నారు. ఒక వైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో పారిశ్రామికరణంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుకు మొండివారి పాలెం, ఆవుల పాలెం, రావులపాలెం, కర్లపాలెం గ్రామాల ప్రజల సహకారం మరువలేనిదని, ఈ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల అండగా ఉంటామని కలెక్టర్ చెప్పారు. న్యాయపరంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తున్నామని చెప్పారు. ఈ కాలనీలో నిర్వాసితులు అందరూ ఇళ్లు నిర్మించుకొని త్వరగా గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 


 కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పోర్టు నిర్వాసిత గ్రామాల ప్రజలకు చెప్పిన మాటకు కట్టుబడి నూరు శాతం హామీలు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. గతంలో లాగా శంకుస్థాపనతో సరిపెట్టకుండా ముందుగానే అన్ని రకాల అనుమతులు, నిధులు సమకూర్చిన తరువాతే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పోర్టు ఏర్పాటుకు ఈ ఏడాది జూలైలో భూమి పూజ చేశారని, అప్పటినుంచి నిర్విరామంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా నీతి నిజాయితీ గల మత్స్యకారులు వాటిని తిరస్కరించారని, ప్రభుత్వంపై నమ్మకంతో పోర్టు ఏర్పాటుకు, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ భూములను అందించారని చెప్పారు. అదేవిధంగా తాము కూడా మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ప్రత్యేక చొరవతో భూమి పూజ జరిగిన నాలుగు నెలలకే ఆర్ అండ్ ఆర్ కాలనీకి శంకుస్థాపన చేయడం, ప్యాకేజీ, భూసేకరణ ప్రక్రియ వేగంగా చేపట్టినట్లు చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి భిన్నంగా ఈ ప్రాంత ప్రజలు తమకు నచ్చినట్లు ఇంటి నిర్మాణాలు చేసుకునే సంపూర్ణ స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందన్నారు. 

 జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మానాధ్ మాట్లాడుతూ అత్యంత వేగంగా రామాయపట్నం పోర్టు పునరావాస ప్రక్రియను చేపట్టామని, గతంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మెరుగైన ప్యాకేజీని ఈ ప్రాంత ప్రజలకు అందించామని, సద్వినియోగం చేసుకొని ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు.

కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును 2023 డిసెంబర్ లోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తునట్లు చెప్పారు. 850 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఇప్పటివరకు 450 ఎకరాలు భూసేకరణ పూర్తయిందన్నారు. ఈ పోర్టు ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు. 


అనంతరం మొండివారి పాలెంకు చెందిన 111 కుటుంబాలకు సుమారు రూ. 22 కోట్ల 49 లక్షల విలువైన భూ నష్టపరిహార చెక్కులను, ఇంటి నివేశ పట్టాలను జిల్లా కలెక్టర్, కందుకూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. 


తొలుత ఆర్ అండ్ ఆర్ కాలనీలో  రామాలయ నిర్మాణానికి  జిల్లా కలెక్టర్, కందుకూరు ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ భూమి పూజ చేశారు. 


ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, గుడ్లూరు తాసిల్దార్ లావణ్య, ఎంపీపీ పులి రమేష్, గ్రామ కాపు పోలయ్య, పోర్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 


Comments