తెలుగు సినీ నట దిగ్గజం కైకాల సత్యనారాయణ

 *- తెలుగు సినీ నట దిగ్గజం కైకాల సత్యనారాయణ


 *- నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రావి* 


గుడివాడ, డిసెంబర్ 23 (ప్రజా అమరావతి): తెలుగు సినీ నట దిగ్గజం కైకాల సత్యనారాయణ అని, ఆయన మరణంతో తెలుగు చలనచిత్రసీమలో విషాదం నెలకొందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కైకాల చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ నవరస నటనా సార్వభౌముడిగా కైకాల సుదీర్ఘ కాలం సేవలందించారని గుర్తుచేశారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో డిగ్రీ వరకు చదివారన్నారు. సిపాయి కూతురు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారన్నారు. తన నటనా జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల మరణం బాధాకరమన్నారు. 60ఏళ్ళ సినీ జీవితంలో 777 సినిమాల్లో నటించారన్నారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలతో పాటు హాస్య, ప్రతినాయక, నాయక భూమికలెన్నో పోషించారన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి వైవిధ్యభరితమైన పాత్రలను కైకాల పోషించారని తెలిపారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చిన కైకాల మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 11వ లోక్ సభకు ఎన్నికయ్యారన్నారు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి కైకాల కృషి చేశారని కొనియాడారు. కైకాల నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించారన్నారు. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు వంటి అనేకం అందుకున్నారన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారన్నారు. కైకాల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రావి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, యార్లగడ్డ సుధారాణి, పోలాసి ఉమామహేశ్వరరావు, కంచర్ల సుధాకర్, అల్లాడ శ్రీను, వాసే మురళి, పెద్దు వీరభద్రరావు, పండ్రాజు సాంబశివరావు, సుంకర గాంధీ, సయ్యద్ జబీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments