ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ

 

విజయవాడ (ప్రజా అమరావతి);



*ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ*


           ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా  పంపిణీ చేసే బియ్యాన్ని  1 జనవరి, 2023 నుండి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం NFSA కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని రాబోయే సంవత్సరం పాటు ఉచితంగా అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర పరిధిలో NFSA లబ్ధిదారులతో పాటు NFSAయేతర కార్డుదారులకు కూడా బియ్యాన్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రేషన్ షాపుల ద్వారా  పంపిణీ చేసే ఇతర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. 


రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల డీలర్లు, MDU ఆపరేటర్లు, కార్డుదారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఉచిత బియ్యం పంపిణీ సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు.  ఈ మేరకు అన్ని షాపుల్లో నోటీసు బోర్డును ప్రదర్శించాలని, ఉచిత బియ్యం పంపిణీపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏపీఎస్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (కంట్రోల్) ఆర్డర్ -2018 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.


ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1967 మరియు టోల్ ఫ్రీ నంబర్లు 18004250082 ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు.


Comments