ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ -2023 వెబ్ సైట్ ప్రారంభం.

 *ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ -2023 వెబ్ సైట్ ప్రారంభం*


*•మార్చి3,4 తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్కు రిజిస్ట్రేషన్లు  చేసుకునే అవకాశం*

*•ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 బ్రోచర్ను ప్రారంభించిన మంత్రులు*

*•ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహణకు ఏర్పాట్లు*

*•ముఖ్యంగా 12  రంగాల్లో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు చర్యలు*

                                                                                                                                                                                  అమరావతి, జనవరి 4 (ప్రజా అమరావతి):   వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 (AP GLOBAL INVESTORS SUMMIT-2023) వెబ్ సైట్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరియు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం ప్రారంభించారు.  రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో కలసి మంత్రులు ఇరువురూ ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023  బ్రోచర్ ను ఆవిష్కరించారు. మంగళవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పాల్గొని ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023  నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వారు వివరించారు.  


ఈ సందర్బంగా రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ సమ్మిట్ లోగోను ఇప్పటికే ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ లోగోను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం  జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  ఈ ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ ను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో  మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమృద్దిగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో   ముఖ్యంగా 12 రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామన్నారు.  అగ్రి & ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిరో స్పేస్ & డిఫెన్సు, ఆటోమొబైల్స్ & ఎలక్ట్రానిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్ & అప్పేరల్స్, ఇండస్ట్రీస్ & లాజిస్టిక్స్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రోలియం & పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్ & ఐటి, ఫార్మాసిటికల్స్ & లైప్ సైన్సుసెస్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎం.ఎస్.ఎం.ఇ., స్టార్టప్స్ & ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలెప్మెంట్ & ఎడ్యుకేషన్ మరియు టూరిజమ్ & హాస్పిటాలిటీ తదితర  12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఆయన తెలిపారు. 


దేశ, విదేశాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను అందరినీ  ఈ  సమ్మిట్ కు  ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్ పై దేశ, విదేశాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు రోడ్ షోలను కూడా  ఈ నెల 20 వ తేదీ నుండి నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఈ నెల 20 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకూ థైవాన్, యు.ఏ.ఇ., జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా మరియు యు.ఎస్.ఏ. తదితర దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో  రోడ్ షోలను నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా  ఈ నెల 10-14 తేదీల మద్య న్యూడిల్లీలోను, ఫిబ్రవరి 3 న ముంబాయిలోను నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో కూడా ఈ రోడ్ షోలను నిర్వహించేదుకు తేదీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 


ఈ సమ్మిట్ నిర్వహణకు సి.ఐ.ఐ. ఈవెంట్ పార్టనర్ గాను, నాలెడ్జు పార్టనర్ గా కె.పి.ఎం.జి. వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహణకు ఈవెంట్ మేనేజర్ గా ఒక ఏజన్సీని కూడా త్వరలో ఖరారు చేయనున్నామన్నారు. ఈ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల కమిటీలను ఇప్పటికే ఏర్పాటుచేసి సంబందిత జి.ఓ.లను కూడా జారీచేయడం జరిగిందన్నారు.  విశాఖపట్నం జిల్లా యంత్రాంగాన్ని కూడా ఈ  సమ్మిట్  నిర్వహణలో ప్రముఖ భాగస్వామ్యులను చేయడం కూడా జరిగిందని,  విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా స్థాయిలో ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.  


అదే విధంగా విశాఖ నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జి-20 సదస్సు, ఏప్రిల్ 24 మరో జి-20 సదస్సు మరియు  మూడు రోజుల పాటు  అంతర్జాతీయ ఆరోగ్య సమ్మిట్, జనవరి 20,21 తేదీల్లో ఐ.టి. కాన్పరెన్సులు మరియు ఫిబ్రవరి 16,17 గ్లోబల్ టెక్సు సమ్మిట్  లను కూడా విశాఖలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ సదస్సులను అన్నింటి అనుసంధానం చేస్తూ  దేశ, విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు ఈ ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023  ప్రధాన వేదిక చేసుకోనున్నట్లు మంత్రి తెలిపాయ.  గత ఏడాది దావోస్ సదస్సు కు  రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హాజరయ్యారని,   ఈ సదస్సులో  జరిగిన పలు ఈ ఒప్పందాల్లో ఇప్పటికే రూ.40 వేల కోట్ల  విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు. 


ఈ పాత్రికేయుల సమావేశానికి ముందు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖల అధికారులు, సి.ఐ.ఐ., కె.పి.ఎం.జి. అధికారులతో మంత్రులు సమావేశమై సమ్మిట్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. 


రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్,  హ్యండ్లూమ్ & టెక్సుటైల్స్ ప్రిన్సిఫల్ సెక్రటరీ  కె.సునీత, పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంచాలకులు డా.జి.స్రిజన, రాష్ట్ర సమాచార, పౌర సంబరాల శాఖ ఇ.ఓ. సెక్రటరీ టి.విజయ్ కుమార్  రెడ్డి,   పరిశ్రమ శాఖ సెక్రటరీ సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Comments